NTV Telugu Site icon

Rishabh Pant: నేను ఆడుంటే ప్లేఆఫ్స్‌కు వెళ్లేవాళ్లం.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Rishabh Pant Interview

Rishabh Pant Interview

Rishabh Pant on Delhi Capitals Playoffs: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో ఆడుంటే.. ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరేదన్నాడు. తన వల్లే ఢిల్లీ గెలుస్తుందని కాదని, ఇంకాస్త మెరుగైన అవకాశాలు ఉండేవని చెబుతున్నా అన్నాడు. ఐపీఎల్ 2024లో మూడుసార్లు స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసినందుకు పంత్‌పై ఒక మ్యాచ్‌ నిషేధం పడింది. దీంతో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఆడలేదు. ఆ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టుకు సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఐపీఎల్ 17వ సీజన్‌లో తన చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. 14 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ చివరి మ్యాచుల్లో ఘోరంగా ఓడితేనే ఢిల్లీకి ప్లేఆఫ్స్‌కు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో లక్నో మ్యాచ్ అనంతరం పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read: Sonakshi Sinha: పెళ్లి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా: సోనాక్షి సిన్హా

‘మా ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఒకవేళ బెంగళూరుతో మ్యాచ్‌లో నేను ఆడుంటే.. నాకౌట్‌కు చేరేవాళ్లమేమో. అంటే నా వల్లే ఢిల్లీ టీమ్ గెలుస్తుందని కాదు. ఇంకాస్త మెరుగైన అవకాశాలు ఉండేవని అంటున్నా. బెంగళూరు మ్యాచ్‌లో ఓడిపోవడం మా పరిస్థితిని సంక్లిష్టంగా మార్చింది. ఆ మ్యాచ్‌లో మా ప్లేయర్స్ అద్భుతంగానే పోరాడారు. కానీ పరాజయం తప్పలేదు. లక్నోను ఓడించి రేసులోకి వచ్చాం. ఇక ఆ దేవుడి చేతుల్లోనే అంతా ఉంది’ అని రిషబ్ పంత్ అన్నాడు. కోల్‌కతా, రాజస్థాన్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరగా.. మిగిలిన ఎండు స్థానాల కోసం ఐదు టీమ్స్ పోటీ పడుతున్నాయి.