Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!

  • వరుసగా ఆరో ఓటమిని ఎదుర్కొన్న పీబీకేఎస్
  • ఆర్సీబీ చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి
  • ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్
Ricky Ponting Pbks

Ricky Ponting Pbks

Ricky Ponting Left Heartbroken After PBKS Defeat: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్‌ (పీబీకేఎస్) పరిస్థితి రోజురోజుకూ క్లిష్టంగా మారుతోంది. ఆదివారం ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోవడంతో.. పీబీకేఎస్ వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ ఆశలు కూడా దాదాపు లేకుండా పోయాయి. మిగిలిన ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడే పరిస్థితి. మ్యాచ్ తర్వాత పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఒంటరిగా డగౌట్‌లో కూర్చుని దినంగా కనిపించిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ ఫొటోను ‘పవర్‌ఫుల్ పిక్చర్’ అంటూ అభివర్ణించాడు.

తన యూట్యూబ్ ఛానెల్ ‘అశ్ కి బాత్’లో మాట్లాడిన ఆర్ అశ్విన్.. ‘మ్యాచ్ తర్వాత టీవీలో ఒక పవర్‌ఫుల్ దృశ్యం కనిపించింది. రికీ పాంటింగ్ ఒంటరిగా డగౌట్‌లో కూర్చున్నాడు. అతడి మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయనిపించింది. ఈ టోర్నీలో టాప్-2లో నిలిచే స్థితిలో ఉన్న జట్టు ఇప్పుడు ఇలా కష్టాల్లో పడటం బాధాకరం. వాళ్లు తమలో తామే ఎక్కడ తప్పు చేశామా అని ఆలోచిస్తుంటారు’ అని చెప్పాడు. పంజాబ్ నిర్వహణపై అశ్విన్ విమర్శలు గుప్పించాడు. ఒకే సీజన్‌లో రెండు వేర్వేరు హోమ్ గ్రౌండ్లను ఉపయోగించడం జట్టుకు నష్టమైందని అభిప్రాయపడ్డాడు. ‘ముల్లాన్‌పూర్‌లో వరుస విజయాలు సాధించిన తర్వాత ధర్మశాలకు వెళ్లి వరుసగా మూడు హోమ్ మ్యాచ్‌లు ఓడిపోయారు. ముల్లాన్‌పూర్, ధర్మశాల పిచ్‌లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పేస్, బౌన్స్ అన్నీ మారిపోతాయి. ఇది పంజాబ్‌కే మరో అవే మ్యాచ్‌లా మారింది’ అని అశ్విన్ పేర్కొన్నాడు.

ఫ్రాంచైజీ వ్యాపార ప్రయోజనాల కోసం క్రికెట్ అవసరాలను పక్కన పెట్టిందని కూడా అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ‘ముల్లాన్‌పూర్ పిచ్‌ను పంజాబ్ ఆటగాళ్లు బాగా అర్థం చేసుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 220 పరుగులు డిఫెండ్ చేయడం దానివల్లే సాధ్యమైంది. కానీ ధర్మశాలకు మారడం జట్టును ఇబ్బందుల్లోకి నెట్టింది. గెలవాలంటే సొంత మైదానాన్ని వదిలిపెట్టకూడదు. వ్యాపారపరంగా బాగుండొచ్చు కానీ.. క్రికెట్ పరంగా ఇది పెద్ద తప్పు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ పాంటింగ్ చాలా బాధలో ఉన్నారు. కానీ ఈ పరిస్థితికి వాళ్లే కారణం’ అని అన్నాడు. పంజాబ్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌తో ఎకానా స్టేడియంలో ఆడనుంది. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే.. ఆ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.