Riyan Parag Eye on Rishabh Pant’s IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ ఐపీఎల్ సీజన్‌లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సీజన్‌లో రియాన్ 13 ఇన్నింగ్స్‌ల్లో 567 పరుగులు చేశాడు. ఇందులో హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2024లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి రాజస్థాన్ జట్టుకు రియాన్ పరాగ్ అద్భుత విజయాలు అందించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ (36; 26 బంతుల్లో, 2×4, 2×6) ఆడాడు.
ఓ ఐపీఎల్ సీజన్‌లో నాలుగు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నాడు. 2018 సీజన్‌లో పంత్ 579 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రియాన్ పరాగ్ (567), రోహిత్ శర్మ (538 రన్స్, 2013), గ్లెన్ మాక్స్‌వెల్ (513 రన్స్, 2021), దినేశ్ కార్తీక్ (498 రన్స్, 2018) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బెంగళూరు మ్యాచ్‌తో రోహిత్ రికార్డును రియాన్ పరాగ్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండటంతో.. పంత్ రికార్డును పరాగ్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read: RCB vs RR Eliminator 2024: బెంగళూరు ఓటమిపై సెటైర్.. చెన్నై ఆటగాడిపై తీవ్ర విమర్శలు!
అసోంకి చెందిన 22 ఏళ్ల రియాన్ పరాగ్.. 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను గెలిపించిన తర్వాత రాహుల్ తెవాతియాతో కలిసి డ్యాన్స్ చేయడం అప్పట్లో వైరల్ అయ్యింది. ఎప్పుడో ఓసారి మంచి ఇన్నింగ్స్ ఆడుతూ.. నెట్టింట ఎక్కువగా రచ్చ చేశాడు. దాంతో ఓవరాక్షన్ స్టార్ అని నెటిజెన్స్ ఓ బిరుదు కూడా ఇచ్చేశారు. ఐపీఎల్ 2023లో 7 ఇన్నింగ్స్‌ల్లో 70 పరుగులు మాత్రమే చేయడంతో తుది జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. రూ.3.8 కోట్లు పెట్టుబడి పెట్టిన రాజస్థాన్ ప్రాంచైజీకి నిరాశే ఎదురైంది. అయితే దేవ్‌ధార్ ట్రోఫీ (354), సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో (510) అదరగొట్టిన పరాగ్.. అదే ఫామ్‌ను ఐపీఎల్ 2024లోనూ కొనసాగిస్తున్నాడు.