ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం రాయపూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట కోల్‌కతా 4 వికెట్ల నష్టానికి 192 రన్స్ చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కీలక విజయం సాధించిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే తనకు తగిలిన గాయం, విరాట్ కోహ్లీ ఫామ్, జట్టు కాంబినేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మ్యాచ్ సందర్భంగా తలకు బలంగా బంతి తగిలిన విషయంపై స్పందించిన రజత్ పటీదార్.. ‘ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నిజం చెప్పాలంటే.. బంతి గట్టిగా తాకింది’ అని నవ్వుతూ చెప్పాడు. ‘ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండటం ఆనందంగా ఉంది. కానీ మేము ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెడుతున్నాం. ఈసారి కూడా కప్ వదలం. టోర్నీలో ప్రతి దశలో ఆటగాళ్లు జట్టుకు సహకరిస్తున్నారు. అందరూ తమ పాత్రను బాగా నిర్వర్తిస్తున్నారు. ఇది జట్టుకు చాలా మంచి సంకేతం’ అని పటీదార్ పేర్కొన్నాడు.
‘మొదటి 10 ఓవర్లలో కేకేఆర్ రన్‌రేట్ 10-11 మధ్యలో ఉంది. ఆ దశలో మ్యాచ్ పూర్తిగా వారి వైపు వెళ్లేలా కనిపించింది. మా బౌలర్లు పుంజుకుంటారు. కోల్‌కతా బ్యాటర్లను కట్టడి చేసి 194 పరుగుల వరకే ఆపగలిగాం. మా బౌలింగ్ యూనిట్‌పై సంతోషంగా ఉంది. పిచ్ పరిస్థితుల కారణంతో నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాం. గత మ్యాచ్ కూడా ఇదే పిచ్‌పై ఆడాం. అక్కడ అనూహ్య బౌన్స్ కనిపించింది. అందుకే ఈ మ్యాచ్‌లో నలుగురు సీమర్లతో ఆడాలని నిర్ణయించుకున్నాం. ఈ కాంబినేషన్ ఎప్పటికి ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటా’ అని వివరించాడు.
కింగ్ విరాట్ కోహ్లీపై రజత్ పటీదార్ ప్రశంసలు కురిపించాడు. ‘విరాట్ కోహ్లీ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. అతడు గొప్ప ఆటగాడు. ప్రతిసారి భారీ ఇన్నింగ్స్‌లు ఆడడం అలవాటుగా మార్చుకున్నాడు. వరుసగా రెండు డకౌట్లు నమోదైనా కోహ్లీపై జట్టుకు పూర్తి నమ్మకం ఉంది. ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మేము ధర్మశాలకు వెళ్తున్నాం. అక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఆ మ్యాచ్‌లో కూడా గెలవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. తర్వాత హైదరాబాద్ మ్యాచ్‌పై ఫోకస్ పెడతాం. ఫిల్ సాల్ట్ గాయంపై ప్రస్తుతం పూర్తి సమాచారం లేదు. కానీ త్వరలోనే తిరిగి వస్తాడని భావిస్తున్నాం’ అని చెప్పాడు. ప్రస్తుతం ఆర్సీబీ అద్భుత ఫామ్‌లో కొనసాగుతుండటంతో ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
