Nicholas Pooran: దాచడానికి ఏముంది, మేం చెత్తగా ఆడాం.. లక్నో కెప్టెన్ పూరన్!

  • ఐపీఎల్ 2026లో తడబడుతున్న ఎల్ఎస్‌జీ
  • ఐదు మ్యాచ్‌లలో రెండే విజయాలు
  • బ్యాటింగ్ వైఫల్యమే ఎల్ఎస్‌జీకి పెద్ద సమస్య
Nicholas Pooran Comments

Nicholas Pooran Comments

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో రెండే విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో బ్యాటింగ్ విభాగంలో విఫలమవడం ఎల్ఎస్‌జీకి పెద్ద సమస్యగా మారింది. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) మ్యాచ్ అనంతరం లక్నో తాత్కాలిక కెప్టెన్ నికోలస్ పూరన్ ఈ విషయాన్ని నిజాయితీగా అంగీకరించాడు. ఈ సీజన్ మొత్తం తమ బ్యాటింగ్ ప్రదర్శన అంచనాలకు తగ్గట్లుగా లేదని, చాలా చెత్తగా ఆడాం అని చెప్పాడు. దాచడానికి ఏముంది, బ్యాటింగ్ కారణంగానే పరాజయాలు ఎదురవుతున్నాయని పూరన్ స్పష్టం చేశాడు.

‘ఈ సీజన్ మాకు చాలా కష్టంగా సాగుతోంది. బ్యాటింగ్‌లో మేము అంచనాలకు తగ్గట్లుగా ఆడలేకపోయాం. ఆర్‌సీబీ మ్యాచ్‌లో 175 పరుగులు చేసినా పోటీ ఇచ్చేవాళ్ళం. కానీ మేం 20-30 రన్స్ తక్కువగా చేశాం. ఈ సీజన్ మొత్తం బ్యాటింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేది నిజం. ఈరోజు కూడా బ్యాటింగ్‌ తప్పిదంతోనే మూల్యం చెల్లించాం. టీ20 క్రికెట్ అనేది చాలా కఠినమైన ఫార్మాట్. ఇందులో నిలకడగా రాణించడం అంత సులభం కాదు. అయినప్పటికీ మా ఆటగాళ్లు కష్టపడుతున్నారు. వారికి క్రెడిట్ ఇవ్వాలి. మేము పోరాడుతూనే ఉంటాం. ఓపికగా ఉండాలి, అవకాశాలు వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి, బాధ్యత తీసుకుని రాణించాలి’ అని నికోలస్ పూరన్ చెప్పాడు.

‘నా బ్యాటింగ్ బాగానే ఉంది. బంతిని బాగా టైమింగ్ చేస్తున్నాను. కానీ ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు నా నుంచి మంచి ఇన్నింగ్స్ రాలేదు. ఫామ్ కోల్పవడం నాకు కొత్త కాదు. ఇలాంటి పరిస్థితులను చాలాసార్లు ఎదుర్కొన్నాను. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎలా బయటపడాలో నాకు తెలుసు. త్వరలోనే నేను తిరిగి ఫామ్‌లోకి వస్తాను’ అని పూరన్ ధీమా వ్యక్తం చేశాడు. ఎల్ఎస్‌జీ బ్యాటింగ్‌లో ఇప్పటికైనా మెరగవకపోతే ఈ సీజన్‌లో తిరిగి పుంజుకోవడం కష్టమే. ఇకపై మ్యాచ్‌ల్లో జట్టు సమిష్టిగా రాణించాల్సిన అవసరం స్పష్టంగా ఉంది.