Mumbai Indians Unwanted Record: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!

  • ముంబై ఇండియన్స్‌కు ఏదీ కలిసిరావడం లేదు
  • సొంత మైదానం వాంఖడేలో మరో ఓటమి
  • ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు
Mumbai Indians Unwanted Record

Mumbai Indians Unwanted Record

Mumbai Indians Unwanted Record in IPL: ఐపీఎల్ 2026లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఏదీ కలిసిరావడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో విఫలమవుతూ పరాజయాలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే మోస్ట్ పాపులర్ టీమ్ ముంబైకి మరో ఓటమి ఎదురైంది. సొంత మైదానం వాంఖడే స్టేడియంలో గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా చెన్నై 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై 104 పరుగులకే కుప్పకూలింది. భారీ తేడాతో ఓడిన ముంబై ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది.

ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా (103) ముంబై ఇండియన్స్‌కు ఇదే అతిపెద్ద ఓటమి. ఇంతకుముందు ముంబైకి భారీ ఓటములు నమోదైనప్పటికీ.. ఈ మ్యాచ్‌లోని ఓటమి అంతకు మించి నమోదైంది. 2013లో రాజస్థాన్ రాయల్స్‌పై 87 పరుగుల తేడాతో ఓడిపోవడమే ముంబైకి ఇప్పటివరకు అతిపెద్ద ఓటమి. ఇప్పుడు చెన్నైతో మ్యాచ్ అగ్రస్థానంలోకి వచ్చింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 85 పరుగుల తేడాతో, 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 76 పరుగుల తేడాతో, 2008లో పంజాబ్‌పై 66 పరుగుల తేడాతో ముంబై ఓడింది. కానీ తాజా మ్యాచ్‌లో చెన్నై చేతిలో 103 పరుగుల తేడాతో ఓడటం ముంబై చరిత్రలోనే చెత్త రికార్డుగా నిలిచింది.

ఐపీఎల్‌లో చెన్నైపై ముంబై చేసిన అత్యల్ప స్కోర్ (104) కూడా ఇదే. ఇంతకుముందు 2021లో దుబాయ్‌లో 136/8 స్కోర్ చేయగా.. ఇప్పుడు ఆ రికార్డు కూడా చెదిరిపోయింది. మరోవైపు ముంబైపై చెన్నై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2023 నుంచి ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఆరు మ్యాచ్‌లలో ఐదింటిలో చెన్నై విజయం సాధించింది. ఈ గణాంకాలు చూస్తే.. ఇటీవలి కాలంలో ముంబైపై చెన్నై పూర్తిగా పైచేయి సాధించిందని చెప్పాలి. అంతేకాదు సొంత మైదానం వాంఖడేలో కూడా ముంబైకి ఇదే అతిపెద్ద పరాజయం కావడం విశేషం. మొత్తానికి చెన్నై దెబ్బకి ముంబై ఖాతాలో అత్యంత చెత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు మరిచిపోలేని చేదు అనుభవంగా మిగిలిపోయింది.