Mumbai Indians Close 10th Place in IPL 2024: ఐపీఎల్ 2024లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబై ఇండియన్స్.. ఈ సీజన్‌ను ఓటమితో ముగించింది. శుక్రవారం వాంఖడేలో లీగ్ ఆఖరి మ్యాచ్ ఆడిన ముంబై.. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. లక్నోపై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పేలవ ప్రదర్శనతో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ముంబై 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్ల ఖాతాలో వేసుకుంది. గత మూడు సీజన్‌లుగా ముంబై ప్లేఆఫ్స్ చేరని విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (75; 29 బంతుల్లో 5×4, 8×6) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ లోకేష్ రాహుల్ (55; 41 బంతుల్లో 3×4, 3×6) రాణించాడు. లక్నో మొదటి 10 ఓవర్లకు స్కోర్ 69/3 కాగా.. తర్వాతి 10 ఓవర్లలో ఏకంగా 145 పరుగులు రాబట్టింది. లక్నో స్కోరు 200 దాటిందంటే కారణం పూరన్. విధ్వంసక విన్యాసాలతో చెలరేగిపోయిన పూరన్.. ఎల్‌ఎస్‌జీకి ఊహించని స్కోరు అందించాడు. సిక్స్‌లు కొట్టడమే పని అన్నట్టుగా ఆడిన అతడు.. 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. పూరన్ ధాటికి లక్నో చివరి 5 ఓవర్లలో 90 పరుగులు రాబట్టింది. ముంబై బౌలర్లలో తుషార (3/28), చావ్లా (3/29) సత్తా చాటారు.
Also Read: Gunfire : ఆఫ్ఘనిస్తాన్‌లో కాల్పులు కలకలం.. నలుగురి కాల్చివేత
భారీ ఛేదనలో ముంబై 196/6కే పరిమితమైంది. రోహిత్ శర్మ (68; 38 బంతుల్లో 10×4, 3×6), నమన్ ధీర్ (62 నాటౌట్; 28 బంతుల్లో 4×4, 5×6) పోరాటం సరిపోలేదు. దూకుడుగా రోహిత్ మంచి శుభారంభం అందించాడు. అయితే వర్షం రావడంతో మ్యాచ్ కాసేపు ఆగింది. మ్యాచ్ తిరిగి మొదలయ్యాక బ్రెవిస్ (23), సూర్యకుమార్ (0)తో పాటు రోహిత్ కూడా పెవిలియన్ చేరడంతో ముంబై వెనకపడిపోయింది. వికెట్లు పడుతూనే ఉండడంతో ఒత్తిడి పెరిగిపోయింది. ఆఖరి ఓవర్లో 34 పరుగులు అవసరం కాగా.. ముంబై 15 పరుగులే చేయగలిగింది. రవి బిష్ణోయ్ (2/37) రాణించాడు.