Site icon NTV Telugu

MS Dhoni Sixes: మా యువ వికెట్ కీపర్‌ సిక్స్‌లే చెన్నై విజయానికి కారణం: రుతురాజ్‌

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad Heap Praise on MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ అన్నాడు. యువ వికెట్‌ కీపర్ ఎంఎస్ ధోనీ కొట్టిన మూడు సిక్స్‌లు జట్టును ఆదుకున్నాయని సరదాగా వ్యాఖ్యానించాడు. హార్డ్‌ హిట్టర్లున్న ముంబై ఇండియన్స్ జట్టును కట్టడి చేయడం అంత సులువేం కాదని రుతురాజ్‌ పేర్కొన్నాడు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమై.. 20 రన్స్ తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్‌లో ధోనీ హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాదగా.. బౌలింగ్‌లో మహీశ పతిరన నిప్పులు చెరిగాడు.

మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. అయితే మా యువ వికెట్‌ కీపర్ కొట్టిన మూడు సిక్స్‌లు జట్టును ఆదుకున్నాయి. ఇలాంటి పిచ్‌పై మేం చేసిన పరుగుల కంటే.. మరో 15 పరుగులు అదనం అవసరమని భావించా. జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. లక్ష్య ఛేదనలో బంతితో మేం మెరుగ్గా రాణించాం. హార్డ్‌ హిట్టర్లున్న ముంబైని కట్టడి చేయడం సులువేం కాదు. పతిరన మరోసారి తన పదునైన బౌలింగ్‌తో జట్టును ఆదుకున్నాడు’ అని అన్నాడు.

Also Read: Ruturaj Gaikwad: భారత ఫాస్టెస్ట్‌ బ్యాటర్‌గా రుతురాజ్‌ గైక్వాడ్.. కోహ్లీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాలేదు!

‘పతిరనతో పాటు తుషార్ దేశ్ పాండే, శార్దూల్ ఠాకూర్ కూడా పరుగులను నియంత్రించారు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే చాలని మ్యాచ్‌ ముందు అనుకున్నాం. అజింక్య రహానేను ఓపెనర్‌గా పంపించడానికి ఓ కారణం ఉంది. అతడు వన్‌డౌన్‌లో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఫామ్‌లోకి రావడానికి రహానేతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాం. నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కెప్టెన్‌ అయిన తర్వాత మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుంది’ అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్‌ చెప్పుకొచ్చాడు.

Exit mobile version