Arjun Tendulkar replaces Akash Madhwal: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. 17వ సీజన్లో దాదాపుగా ఫస్ట్ హాఫ్ పూర్తికాగా.. పాయింట్ల పట్టికలో పంజాబ్, ముంబై జట్లు అట్టడుగున ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో రెండు విజయాలు మాత్రమే సాధించిన ఇరు జట్లు.. గెలుపుపై కన్నేశాయి. దాంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్‌పై గెలిచి ఐపీఎల్ 2024 అర్ధభాగం ముగిసే సమయానికి ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తుది జట్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. గత రెండు మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు ఇచ్చిన పేసర్ ఆకాశ్ మద్వాల్‌ను తప్పించాలని ముంబై మేనేజ్మెంట్ భావిస్తోంది. మద్వాల్ స్థానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటుంది. అర్జున్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఎడమచేతి వాటం ప్లేయర్ అయిన అర్జున్.. బ్యాటింగ్, బౌలింగ్ చేయగలడు.
ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్ రెండు డకౌట్స్ అవ్వడం ముంబైని కలవరపెడుతోంది. ఒక్క హాఫ్ సెంచరీ మినహా.. రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. సూర్య ఫామ్ అందుకోవాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంచనాలు అందుకోలేకపోతున్నాడు. బంతి, బ్యాటు, కెప్టెన్సీలో విఫలమవుతున్నాడు. ఇప్పటికైనా హార్దిక్ రాణిస్తాడేమో చూడాలి. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఫామ్ ముంబైకి కలిసొచ్చే అంశం. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియా షెఫార్డ్ సత్తాచాటితే తిరుగుండదు.
ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియా షెఫార్డ్, శ్రేయస్ గోపాల్, కొయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా.
ఇంపాక్ట్ ప్లేయర్: అర్జున్ టెండూల్కర్.
