Kuldeep Yadav: నేను చెత్త ప్రదర్శన చేశా.. చాలా బాధగా ఉంది.. కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • కోల్‌కతాపై 40 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం
  • కుల్దీప్ యాదవ్‌ (3/29) మాయ
  • చెత్త ప్రదర్శన చేశా అంటున్న కుల్దీప్
Kuldeep Yadav

Kuldeep Yadav

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట ఢిల్లీ 5 వికెట్లకు 203 పరుగులు చేయగా.. కోల్‌కతా 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌ను డీసీ విజయంతో ముగించింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ (3/29) మాయ చేశాడు. కుల్దీప్ తన అద్భుత బౌలింగ్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అవార్డు తీసుకున్న అనంతరం అతడు మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో తన ప్రదర్శనపై సంతృప్తిగా లేనని చెప్పాడు. చివరి మ్యాచ్‌కు ముందు కోచ్‌తో కలిసి చేసిన చిన్న మార్పులే తన బౌలింగ్‌లో పెద్ద తేడా తీసుకొచ్చాయని వెల్లడించాడు. టీ20 క్రికెట్‌లో బ్యాటర్లను బౌలర్ బోల్తా కొట్టించడం ఎంత ముఖ్యంగా వివరించాడు.

‘ఈ ప్రదర్శన తర్వాత చాలా సంతోషంగా ఉంది. కానీ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌కు ముందు నేను సంతోషంగా లేను. జట్టుగా మేము టాప్-4లో నిలవాలని అనుకున్నాం కానీ.. అది సాధ్యపడలేదు. వ్యక్తిగతంగా కూడా ఈ సీజన్‌లో నేను ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాను. నా నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన రావాల్సింది. చివరి మ్యాచ్ ముందు తన కోచ్‌తో కలిసి బౌలింగ్‌లో మార్పులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టా. వైట్ బాల్ క్రికెట్‌లో చిన్న చిన్న విషయాలను చాలా త్వరగా మర్చిపోతాం. నేను కొంచెం ఓపెన్-చెస్టెడ్ యాక్షన్‌తో బౌలింగ్ చేస్తున్నాను. పూర్తి శరీరాన్ని ఉపయోగించకపోవడంతో బంతిని కేవలం పుష్ చేస్తున్నాననే భావన వచ్చింది. అలా చేస్తే టీ20 బ్యాటర్లు చాలా సులభంగా డౌన్ ది గ్రౌండ్ లేదా బ్యాక్ ఫుట్‌పై ఆడుతారు. శరీరాన్ని పూర్తిగా ఉపయోగించి బంతిని ఎక్కువగా స్పిన్ చేయడం ప్రారంభించిన తర్వాతే ఫలితాలు వచ్చాయి. బంతికి డిప్, డ్రిఫ్ట్ రావడం మొదలైంది. అలాగే వేగాన్ని కూడా మార్చగలిగాను. ముఖ్యంగా రింకూ సింగ్ వికెట్ అందుకు మంచి ఉదాహరణ. బంతిని నెమ్మదిగా వదిలి అతడిని బోల్తా కొట్టించా’ అని కుల్దీప్ యాదవ్ తెలిపాడు.

గాయంతోనే బౌలింగ్ చేసిన విషయంపై కుల్దీప్ యాదవ్ స్పందిస్తూ.. ‘నా ప్లాన్ చాలా క్లియర్‌గా ఉంది. పిచ్ కొంచెం నెమ్మదిగా ఉందని ముందుగానే అర్థమైంది. అందుకే వేగాన్ని మారుస్తూ, స్క్రాంబుల్ సీమ్ ఉపయోగిస్తూ బ్యాటర్లను అవుట్ చేయాలని చూశాను’ అని చెప్పాడు. హ్యాట్రిక్ మిస్ కావడంపై మాట్లాడుతూ.. ‘అది ఆటలో భాగమే. హ్యాట్రిక్ వచ్చిందా లేదా అన్నది పెద్ద విషయం కాదు. నేను బౌలింగ్ చేసిన విధానం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’ అని అన్నాడు. టీ20ల్లో మళ్లీ బేసిక్స్‌కి వెళ్లడం ఎంత ముఖ్యమో కూడా కుల్దీప్ వివరించాడు. ‘నా కోచ్ నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. బాస్.. బంతిని ఎక్కువగా స్పిన్ చేయి. బ్యాటర్‌ను అవుట్ చేయడానికి ప్రయత్నించు’ అని చెప్పాడు. బ్యాటర్లు దాడి చేస్తున్నా సరే.. బంతిని టర్న్ చేస్తే ఎప్పుడూ వికెట్ తీసే అవకాశం ఉంటుంది’ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.