KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్‌లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్‌స్టోన్!

  • కోల్‌కతాలో అభిమానులకు అసలైన మజా
  • ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్
  • కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్‌స్టోన్
Kkr Vs Gt Record

Kkr Vs Gt Record

ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా.. టీ20 క్రికెట్‌లో కూడా ప్రత్యేకంగా నిలిచింది.

టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారి ఒకే మ్యాచ్‌లో ఆరుగురు బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేశారు. దీంతో ఈ మ్యాచ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఫిన్ అలెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. మరోవైపు యువ ఆటగాడు అంక్రిష్ రఘువంశీ 44 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కామెరాన్ గ్రీన్ 28 బంతుల్లో 52 పరుగులతో అర్ధశతకం నమోదు చేశాడు.

248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కూడా అద్భుత పోరాటం చేసింది. కెప్టెన్ శుభమాన్ గిల్ 85 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జోస్ బట్లర్ 57 పరుగులు చేసి జట్టులో ఆశలు రేకెత్తించాడు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ 53 పరుగులతో రాణించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు, గుజరాత్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు బాదారు. ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా.. టీ20 క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో ఆరుగురు బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.