NTV Telugu Site icon

Shreyas Iyer: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్.. ఏకైక కెప్టెన్‌గా అరుదైన రికార్డు!

Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer Creates a History in IPL: కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో రెండు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయిర్-1 మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా‌ ఫైనల్‌కు చేరడంతో శ్రేయస్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది.

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను శ్రేయస్ అయ్యర్ ఫైనల్‌కు చేర్చాడు. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్ 2024 ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ అతడిని వదులుకుంది. కేకేఆర్‌కు వచ్చిన శ్రేయస్.. మరోసారి తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించాడు. లీగ్ దశలో అద్భుత విజయాలతో కోల్‌కతాను అగ్రస్థానంలో నిలిపాడు. క్వాలిఫయిర్-1లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తన నాయకత్వంతో కట్టడి చేశాడు. ఇక క్వాలిఫయిర్-2 విజేతతో చెపాక్ వేదికగా ఆదివారం కేకేఆర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

Also Read: RR vs RCB Eliminator 2024: ఆర్‌సీబీనే ఆధిపత్యం చెలాయిస్తుంది.. ఆర్‌ఆర్‌ మ్యాజిక్‌ చేస్తేనే..!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. రాహుల్‌ త్రిపాఠి (55; 35 బంతుల్లో 7×4, 1×6) ఒంటరి పోరాటం చేశాడు. క్లాసెన్‌ (32; 21 బంతుల్లో 3×4, 1×6), కమిన్స్‌ (30; 24 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. లక్ష్య చేధనలో కోల్‌కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (51 నాటౌట్‌; 28 బంతుల్లో 5×4, 4×6), శ్రేయస్‌ అయ్యర్‌ (58 నాటౌట్‌; 24 బంతుల్లో 5×4, 4×6) చెలరేగారు.