Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!

  • ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమి
  • బట్లర్ బ్యాటింగ్ స్థానాన్ని చివరి నిమిషంలో మార్చిన కోచ్
  • నిశాంత్ సింధూను మూడో స్థానంలో పంపారు
Jos Buttler Ipl, Ashish Nehra

Jos Buttler Ipl, Ashish Nehra

Jos Buttler Reveals IPL Final Surprise: ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఓటమి వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ వెల్లడించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన తుది పోరులో తన బ్యాటింగ్ స్థానాన్ని చివరి నిమిషంలో మార్చిన విషయాన్ని తాజాగా బట్లర్ తెలిపాడు. కోచ్ ఆశిష్ నెహ్రా నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. తాను హెల్మెట్ ధరించి క్రీజ్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. కోచ్ ఒక్కసారిగా వచ్చి ఆపాడని బట్లర్ పేర్కొన్నాడు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. సాధారణంగా ఈ సీజన్ మొత్తం మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన జోస్ బట్లర్.. ఫైనల్‌లో మాత్రం నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో ఓవర్‌లోనే జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో.. బట్లర్ బ్యాటింగ్‌కు సిద్ధమయ్యాడు. హెల్మెట్ ధరించి క్రీజ్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా కోచ్ ఆశిష్ నెహ్రా తనను ఆపేశాడని బట్లర్ వెల్లడించాడు. ‘మొదటి వికెట్ పడగానే నేను బ్యాటింగ్‌కు వెళ్లేందుకు లేచాను. కానీ ఆశిష్ నెహ్రా నన్ను కూర్చోమని చెప్పి, నిశాంత్ సింధూను మూడో స్థానంలో పంపిస్తున్నామని చెప్పారు’ అని బట్లర్ చెప్పాడు.

×
×
Ad

ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత ఆ నిర్ణయం గురించి కోచ్ నెహ్రాను ప్రశ్నించానని బట్లర్ తెలిపాడు. ‘ఆ సమయంలో పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని నెహ్రా నాతో చెప్పారు. నిశాంత్ టాప్ ఆర్డర్ బ్యాటర్ కావడంతో అతడికి అవకాశమివ్వాలని భావించామని వివరించారు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో కూడా అతడు నాకంటే ముందే బ్యాటింగ్ చేశాడు. నిర్ణయం సరైందా, తప్పా అనేది పక్కన పెడితే.. ఆ రోజు మాత్రం మా జట్టుకు అది కలిసి రాలేదు. మేము ఓడిపోయాం. నాకు చాలా బాధగా అనిపించింది’ అని బట్లర్ వివరించాడు.

నిశాంత్ సింధూను మూడో స్థానంలో పంపిన నిర్ణయం ఫలించకపోగా.. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బట్లర్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. అతడు 23 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి.. ఐపీఎల్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకుంది.

జోస్ బట్లర్ కెరీర్‌లో ఇది రెండో ఐపీఎల్ ఫైనల్ ఓటమి. 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టును ఫైనల్‌కు చేర్చినప్పటికీ.. అప్పట్లో కూడా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి చవిచూశాడు. 2017లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ బాధ్యతల కారణంగా ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోయాడు. ఫైనల్‌లో జరిగిన ఈ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆశిష్ నెహ్రా తీసుకున్న ఆ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ఎంత ప్రభావం చూపిందనే అంశంపై అభిమానులు, విశ్లేషకులు చర్చిస్తున్నారు.