NTV Telugu Site icon

Jasprit Bumrah: ఆ రెండు బ్యాటర్లకు వరంలా మారాయి.. బౌలర్లను ఆటాడుకుంటున్నారు: బుమ్రా

Jasprit Bumrah Mi

Jasprit Bumrah Mi

Jasprit Bumrah about Impact Player Rule in IPL 2024: టీ20ల్లో బ్యాటర్లదే పైచేయి అని, బౌలర్లకు చాలా కఠినమైన ఫార్మాట్‌ అని టీమిండియా స్టార్ పాసెర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. టైమ్‌ నిబంధనలతో పాటు ఇంపాక్ట్‌ రూల్‌ కూడా బ్యాటర్లు వరంలా మారిందని, వాటితో బౌలర్లను ఆటాడుకుంటున్నారని పేర్కొన్నాడు. డెత్‌ ఓవర్లలో ముంబై ఇండియన్స్ బౌలర్లకు తాను ఎక్కువగా సూచనలు చేయనని బుమ్రా తెలిపాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా గురువారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కిన విషయం తెలిసిందే.

పంజాబ్‌ కింగ్స్‌పై జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లను పడగొట్టాడు. బుమ్రా వేసిన తొలి ఓవర్‌లోనే సామ్‌ కరన్, రిలీ రొసోవ్‌ను ఔట్ చేశాడు. ఐపీఎల్ 2024లో తొలిసారి పవర్‌ ప్లేలో అతడు రెండు ఓవర్లు వేయడం గమనార్హం. ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా బుమ్రా మాట్లాడుతూ… ‘మేం అనుకున్నదానికంటే ఉత్కంఠగా మ్యాచ్‌ ముగిసింది. పంజాబ్‌ యువ బ్యాటర్లు అశుతోష్‌ శర్మ, శశాంక్‌ సింగ్‌ అద్భుతంగా ఆడారు. ఓ సమయంలో భయపెట్టారు’ అని పేర్కొన్నాడు.

Also Read: Virat Kohli: ఆర్‌సీబీ వరుస పరాజయాల వేళ.. విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త!

‘టీ20ల్లో బ్యాటర్లదే పైచేయి. బౌలర్లకు ఇది చాలా కఠినమైన ఫార్మాట్‌. టైమ్‌ నిబంధన, ఇంపాక్ట్‌ ప్లేయర్ రూల్‌ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రధాన కారణం. లోతైన బ్యాటింగ్‌ ఉండటంతో బౌలర్లు వైవిధ్యంగా ప్రయత్నించాల్సి ఉంటుంది. మ్యాచ్‌ ఆరంభంలో బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. పవర్‌ ప్లేలో కనీసం రెండు ఓవర్లు వేస్తేనే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. డెత్‌ ఓవర్లపై బౌలర్లకు ఎక్కువగా సూచనలు చేయను. వారి ఇష్టానికే వదిలేస్తా. అప్పుడే వారు స్వేచ్ఛగా బౌలింగ్ చేస్తారు’ అని జస్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు.