ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం, టీనేజ్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ పవర్‌ప్లేలో పరుగుల సునామీ సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్క సీజన్‌లో పవర్‌ప్లే ఓవర్లలో (1-6 ఓవర్లు) 500 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్‌గా సూర్యవంశీ చరిత్ర పుటల్లోకెక్కారు. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఆయన ఈ అద్భుతమైన ఘనతను సొంతం చేసుకున్నారు.
వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ పవర్‌ప్లేలో ఏకంగా 233.63 భీకర స్ట్రైక్ రేట్‌తో 521 పరుగులు బాది అగ్రస్థానంలో నిలిచారు. టి20 క్రికెట్ చరిత్రలోనే పవర్‌ప్లేలో ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎవరూ చేయలేదు. గతంలో ఈ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ 2016 సీజన్ పవర్‌ప్లేలో 150.16 స్ట్రైక్ రేట్‌తో 467 పరుగులు సాధించారు. ఆ తర్వాత స్థానాల్లో ట్రావిస్ హెడ్ (402 పరుగులు – 2024), సాయి సుదర్శన్ (402 పరుగులు – 2025), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (382 పరుగులు – 2009) ఉన్నారు. వీరి తర్వాత జోస్ బట్లర్ (374 రన్స్ – 2022), విరాట్ కోహ్లీ (373 రన్స్ – 2024) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫైయర్-2 పోరులో యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ వంటి కీలక వికెట్లు త్వరగానే పడిపోయినా.. సూర్యవంశీ మాత్రం తనదైన శైలిలో భీకర బ్యాటింగ్‌ను కొనసాగించారు. వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేసి మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. గత మ్యాచ్‌లోనే కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన ఈ బిహార్ యువ కెరటం, ఇప్పుడు 500 పరుగుల మైలురాయిని దాటి లీగ్‌లోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్‌గా అవతరించారు. అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం సైతం ఈ 15 ఏళ్ల కుర్రాడి పవర్‌ప్లే ప్రదర్శనను చూసి నివ్వెరపోతోంది.

