Vaibhav Sooryavanshi: “రెండు సెంచరీలు మిస్.. ఫీల్ అవుతున్నావా?”.. క్వాలిఫయర్ 2కు ముందు వైభవ్ ఆసక్తికర సమాధానం..

Vaibhav Sooryavanshi Match

Vaibhav Sooryavanshi Match

Vaibhav Sooryavanshi: వ్యక్తిగత సెంచరీల కంటే కూడా తన జట్టు గెలుపే అత్యంత ముఖ్యమని, ఐపీఎల్ టైటిల్ గెలవడమే తన అసలు లక్ష్యమని రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్పష్టం చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌కు ముందు అతను ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో వైభవ్ రెండుసార్లు సెంచరీ మార్కును తృటిలో మిస్ చేసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 97 పరుగుల వద్ద అవుటైనప్పుడు వైభవ్ తీవ్ర నిరాశతో, భారంగా డ్రెస్సింగ్ రూమ్‌ వైపు అడుగులు వేయడం అతని అందరినీ కలచివేసింది. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లోనూ 93 పరుగుల వద్ద అవుట్ కావడంతో ఈ 15 ఏళ్ల కుర్రాడు తీవ్రంగా కలత చెందాడు.

అయినప్పటికీ, న్యూ చండీగఢ్‌లో జరగబోయే కీలకమైన మ్యాచ్‌కు ముందు జియోస్టార్‌తో మాట్లాడుతూ.. అతను తన వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికే ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించాడు. “నేను వంద, రెండొందలు లేదా మూడొందల పరుగులు చేసినా, నా వల్ల జట్టు గెలవకపోతే ఆ పరుగులకు ఎలాంటి విలువ ఉండదని మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు చెబుతూనే ఉన్నారు. అవి కేవలం మన వ్యక్తిగత రికార్డులకే పనికొస్తాయి తప్ప జట్టుకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. క్రికెట్ అనేది చివరికి ఒక టీమ్ గేమ్. అందుకే, నేను సెంచరీ కొట్టి జట్టు ఓడిపోవడం కంటే, నేను 80 పరుగులు చేసి నా జట్టు గెలిస్తే ఆ 80 పరుగులే నాకు వంద కంటే ఎక్కువ” అని వైభవ్ ఎంతో పరిణతితో చెప్పాడు.

×
×
Ad

క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌కు ముందు జట్టు మైండ్‌సెట్ ఎలా ఉందో చెప్తూ, ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే తన కోరికను వైభవ్ బయటపెట్టాడు. “మేము మంచి మైండ్‌సెట్, సానుకూల దృక్పథంతో బరిలోకి దిగాలనుకుంటున్నాము. టోర్నమెంట్‌లో జట్టుగా మేము ఇప్పటివరకు ఏం చేశామో దాన్నే కొనసాగిస్తాము. పెద్ద మ్యాచ్ అనే ఒత్తిడి అస్సలు తీసుకోకుండా, మా బలాన్ని నమ్ముకుని, ఆటను ఎప్పటిలాగే ఎంజాయ్ చేయాలి. ఒక జట్టుగా మేము ఫైనల్స్‌కు చేరుకుని ట్రోఫీని గెలవాలని ఆశిస్తున్నాం” అని ఈ 15 ఏళ్ల యువ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గట్టి పోటీని ఎదుర్కొని రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్‌ను రూ.1.10 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆర్‌ఆర్ ట్రయల్స్ తర్వాత తనకు టీమ్ మేనేజర్ రోమీ భిందర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిన విషయాన్ని వైభవ్ గుర్తుచేసుకున్నాడు. “నేను దుబాయ్‌లో ఉన్నప్పుడు వేలం జరుగుతోంది. ట్రయల్స్ పూర్తయ్యాక టీమ్ మేనేజర్ రోమీ భిందర్ సార్ నాకు ఫోన్ చేశారు. నన్ను వేలంలో దక్కించుకుంటారని నమ్మకం ఇచ్చారు. ఆ తర్వాత ఆయనే ఫోన్ చేసి రెండు మూడు నిమిషాలు మాట్లాడి నన్ను అభినందించారు” అని వైభవ్ తెలిపాడు.