Vaibhav Net Worth: “కోటీశ్వరుడే నండోయ్”.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?

Vaibhav Sooryavanshi Net Worth

Vaibhav Sooryavanshi Net Worth

Vaibhav Sooryavanshi Net Worth: ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ఊచకోత కోస్తున్నాడు. బుధవారం ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసి క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లగా, ఈ విజయానికి వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ప్రధాన కారణమైంది. ఈ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో ఏకంగా 97 పరుగులు బాది అతడు మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. చిన్నతనం నుంచే క్రికెటర్ కావాలని కలలుగన్న వైభవ్, 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2025 వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగిన అతడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏకంగా రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసి కోటీశ్వరుల జాబితాలో చేర్చింది.

ప్రస్థుతం 2026 సీజన్‌లోనూ అదే ఒప్పందంతో అతడు కొనసాగుతున్నాడు. వివిధ నివేదికల ప్రకారం.. ప్రస్తుతం వైభవ్‌కు ఐపీఎల్ జీతంతోపాటు అండర్-19 క్రికెట్ మ్యాచ్ ఫీజుల (అండర్-19లో ప్రతి మ్యాచ్‌కు రూ.20 వేలు) వస్తుంది. ఇక, ప్రస్తుత అంచనా నెట్‌వర్త్ (ఆస్తి విలువ) దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య ఉంది. అయితే ఇది అధికారిక సమాచారం కాదు. ఐపీఎల్‌లో అతడి అద్భుతమైన ప్రదర్శన కారణంగా ప్రముఖ బ్రాండ్‌ల దృష్టి అతడిపై పడింది. ఈ క్రమంలోనే 2026లో ‘జైడస్ వెల్‌నెస్’ సంస్థకు చెందిన ‘కాంప్లాన్’ (Complan) బ్రాండ్ అతడిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. కాకపోతే ఈ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారా వచ్చే ఆదాయ వివరాలు ఇంకా స్పష్టం కాలేదు.

ఈ అద్భుత ప్రగతి వెనుక వైభవ్ తండ్రి చేసిన ఎనలేని త్యాగం దాగుంది. బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లా తాజ్‌పూర్‌లో 2011 మార్చి 27న జన్మించిన వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక సాధారణ వ్యవసాయదారుడు. కొడుకు కలలను నిజం చేయడం కోసం ఆయన ఎలాంటి లోటూ రానివ్వలేదు. ఆఖరికి వైభవ్‌ను పాట్నాలో క్రికెట్ శిక్షణకు పంపేందుకు అవసరమైన డబ్బు కోసం తన సొంత భూమిని సైతం అమ్మేశారు. నాడు తండ్రి చేసిన త్యాగం, కొడుకు కలలకు ఇచ్చిన మద్దతు వల్లే నేడు వైభవ్ సూర్యవంశీ క్రికెట్ పిచ్‌పై ఈ రేంజ్‌లో ధూమ్ ధామ్ సృష్టిస్తున్నాడు.