Site icon NTV Telugu

SRH vs RR: కాటేరమ్మకొడుకుల దెబ్బకు అల్లాడిన రాజస్థాన్.. ఐపీఎల్ చరిత్రలోనే దారుణమైన రికార్డ్

Srh Vs Rr

Srh Vs Rr

SRH vs RR IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) చేతిలో రాజస్థాన్ రాయల్స్(RR) ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2026లో పీడకలలా మారింది. సూటిగా చెప్పాలంటే కాటేరమ్మకొడుకుల దెబ్బకు రాజస్థాన్ అల్లాడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ చెత్త రికార్డులు నమోదు చేసింది. రాజస్థాన్ టాప్-4 బ్యాటర్లు కలిసి చేసిన పరుగులు కేవలం ‘ఒక్కటి’ మాత్రమే. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టులోని మొదటి నలుగురు బ్యాటర్లు ఇంత తక్కువ స్కోరు నమోదు చేయడం ఇదే తొలిసారి. యశస్వి జైస్వాల్ ఒక్క పరుగు చేయగా.. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, లువాన్ డ్రే ప్రిటోరియస్ ముగ్గురూ ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుదిరిగారు. వికెట్ల పతనం ఎంత వేగంగా సాగిందంటే.. కేవలం 10 బంతుల్లోనే మొదటి 4 వికెట్లు, 18 బంతుల్లోనే మొదటి 5 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. గతంలో 2011లో కొచ్చి టస్కర్స్ కేరళ పేరిట ఉన్న రికార్డులను రాజస్థాన్ తుడిచిపెట్టేసింది.

READ MORE: Saqib Hussain Debut: ఈ ప్రదర్శనను అస్సలు ఊహించలేదు.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మరోవైపు.. హైదరాబాద్ బౌలర్లలో అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింగే అద్భుతమే చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. వైభవ్, జురెల్, ప్రిటోరియస్‌లను పెవిలియన్ పంపి రాజస్థాన్ వెన్ను విరిచాడు. ప్రఫుల్ 4/34 గణాంకాలతో ఆకట్టుకోగా, మరో డెబ్యూటెంట్ సాకిబ్ హుస్సేన్ (4/24) జైస్వాల్ వికెట్‌తో పాటు కీలక వికెట్లు తీసి రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో ఒక దశలో రాజస్థాన్ 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి అత్యంత దారుణ స్థితికి చేరుకుంది. ఇక డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా జంట పోరాడి 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి పోరాటంతో రాజస్థాన్ 159 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో పడిన 10 వికెట్లు కూడా పేసర్ల ఖాతాలోకి వెళ్లడం మరో విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇది ఏడోసారి మాత్రమే. ఈ మ్యాచ్‌తో రాజస్థాన్ కుమిలిపోయింది.

Exit mobile version