SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్ 19వ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. కావ్య మారన్‌కు చెందిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మే 27న న్యూ చండీగఢ్‌లో జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే, మే 29న అదే వేదికపై క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడుతుంది. ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఎస్‌ఆర్‌హెచ్ ఈ క్వాలిఫైయర్-2 లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. గతంలో 2016 సీజన్‌లోనూ సన్‌రైజర్స్ ఇలాంటి అద్భుతాన్నే చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి ట్రోఫీని గెలుచుకున్న ఏకైక జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్ రికార్డు సృష్టించింది. ఆ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో మొదట కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఆ తర్వాత గుజరాత్ లయన్స్ (GL) జట్లను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఆపై ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిర్దేశించిన భారీ లక్ష్యానికి ఎదురుగా 208 పరుగులను విజయవంతంగా డిఫెండ్ చేసుకుని మొదటిసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. కాగా, 2011 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సైతం ఎలిమినేటర్ ఆడి ఫైనల్‌కు చేరినప్పటికీ, టైటిల్ మాత్రం గెలవలేకపోయింది.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతిపెద్ద బలం అద్భుత బ్యాటింగే అని చెప్పాలి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉంటూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తున్నారు. క్లాసెన్ ఈ సీజన్‌లో 14 మ్యాచుల్లో 606 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 563 పరుగులు, ఇషాన్ కిషన్ 569 పరుగులు సాధించారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్ అదరగొడుతున్నారు. మలింగ 14 మ్యాచుల్లో 19 వికెట్లు పడగొట్టగా, సాకిబ్ హుస్సేన్ 10 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ సమతూకంగా ఉండటంతోనే ఈసారి ఎస్‌ఆర్‌హెచ్ టైటిల్ గెలిచే బలమైన జట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ ఈసారి కూడా సన్‌రైజర్స్ ఎలిమినేటర్ ఆడి ట్రోఫీ గెలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి స్క్వాడ్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలిల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ట్రావిస్ హెడ్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, జీషన్ అన్సారీ, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మదుశంక, క్రేన్స్ ఫులేత్రా, ఓంకార్ తర్మాలే, ఆర్ఎస్ అంబరీష్ మరియు అమిత్ కుమార్.
