Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసుకు ముందు గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, గెలుపు జోరును కొనసాగిస్తుండటం పట్ల గిల్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. అసలు గుజరాత్ టైటాన్స్ జట్టు లీగ్ దశలో పుంజుకోవడానికి ఢిల్లీలో సాధించిన విజయమే టర్నింగ్ పాయింట్ అని గిల్ స్పష్టం చేశాడు. నిజానికి అంతకుముందు ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టు చాలా గట్టి పోటీ ఇచ్చిందని, అయితే విజయం కోసం కావాల్సిన ఆ అదనపు 5 శాతం శ్రమ ఢిల్లీ మ్యాచ్‌తో దొరికిందని చెప్పాడు. ఆ మ్యాచ్ తర్వాత తమ జట్టు వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోతోందని ధీమా వ్యక్తం చేశాడు. అహ్మదాబాద్ పిచ్‌పై ప్రత్యర్థి జట్టు బౌలర్ల కంటే గుజరాత్ బౌలర్లు ఎందుకు అంత ప్రభావం చూపుతున్నారనే విషయమై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వికెట్ మీద స్థిరంగా సరైన లెంగ్త్‌లో బంతులు వేయడం చాలా ముఖ్యమని, అప్పుడప్పుడు మంచి బంతులు సైతం సిక్సర్లుగా మారే అవకాశం ఉంటుందని అన్నాడు. అలాంటి సమయంలో అధైర్యపడకుండా, తమను తాము నమ్ముకుంటూ బ్యాటర్లకు ఆడటం కష్టమయ్యే లెంగ్త్లలోనే నిలకడగా బౌలింగ్ చేయడం తమ బౌలర్ల విజయరహస్యమని వివరించాడు.
ఇక తన వ్యక్తిగత బ్యాటింగ్ ఫామ్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తాను బ్యాటింగ్ చేస్తున్న తీరు పట్ల చాలా సంతృప్తిగా ఉన్నానని గిల్ చెప్పాడు. అయితే ప్రతి మ్యాచ్‌లో అవుట్ అయిన ప్రతిసారీ ‘ఇంకోలా ఆడి ఉంటే బాగుండేది’ అనే ఫీలింగ్ సహజంగానే ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అలాగే గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఫీల్డింగ్, క్యాచ్‌లు పట్టడం చాలా మెరుగయ్యాయని, రాబోయే రోజుల్లోనూ ఇదే తీరును కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. శివమ్ దూబే క్యాచ్ అందుకున్న తర్వాత గిల్ ఎమోషనల్ కావడంపై స్పందిస్తూ.. ఇలాంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌లలో ఒక్కోసారి భావోద్వేగాలను ఆపుకోవడం సాధ్యం కాదని, ఆ క్షణంలో తన ఎమోషన్స్ అలా బయటకు వచ్చేశాయని నవ్వుతూ చెప్పాడు. అంతకుముందు కొద్దిగా ఇబ్బంది పెట్టిన తన మెడ నొప్పి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని, అంతా బాగుందని స్పష్టం చేశాడు.
Also Read
- Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్‌కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
- Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
- Ruturaj Gaikwad: "అలా చేసినందుకు నాకేమీ పశ్చాత్తాపం లేదు".. చెన్నై ఘోర పరాజయంపై కెప్టెన్ రియాక్షన్..
- GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
ప్లేఆఫ్స్‌కు వెళ్లే ముందు జట్టులో ఏవైనా మార్పులు లేదా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉన్నాయా అని ప్రశ్నించగా.. తాము కొత్తగా జోడించాల్సినవి ఏవీ లేవని గిల్ అన్నాడు. ఇప్పటివరకు తాము ఏవైతే మంచి విషయాలు చేస్తూ వస్తున్నామో, వాటిని మ్యాచ్ తర్వాత మ్యాచ్ అంతే ప్రభావంతో, అదే కసితో కొనసాగించడమే కీలకమని చెప్పాడు. తాము చేస్తున్న పనులను స్థిరంగా కొనసాగిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు. గత సీజన్‌కు, ఈ సీజన్‌కు కెప్టెన్‌గా తనకేమైనా తేడా అనిపించిందా అనే విషయమై గిల్ మాట్లాడుతూ.. పెద్దగా తేడా ఏమీ లేదన్నాడు. గత సీజన్లోనూ 12 మ్యాచ్‌ల తర్వాత తాము నంబర్ వన్ స్థానంలోనే ఉన్నామని, ఈసారి కూడా అలాగే టాప్-2 లో నిలకడగా కొనసాగుతున్నామని గుర్తు చేశాడు. అయితే గత సీజన్ చివరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఇదే అహ్మదాబాద్ గ్రౌండ్లో తాము ఓడిపోయామని, అందులోనూ చివరి మ్యాచ్ ఇదే ప్రత్యర్థితో ఆడినప్పుడు వారు 230 పరుగులు చేస్తే తాము కేవలం 110-120 పరుగులకే ఆలౌట్ అయ్యామని గిల్ గుర్తుచేసుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లోకి వెళ్లేముందు పాత చేదు జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పటికీ, తామేమీ ఒత్తిడికి గురికాలేదని, ఈ సీజన్ అంతా చాలా పద్ధతిగా ఆడామని వివరించాడు.
ఇక నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) అద్భుత విజయాన్ని అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగిన ఈ పోరులో గుజరాత్ బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించి చెన్నైని కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ టేబుల్లో టాప్-2 లో తన స్థానాన్ని అధికారికంగా ఖరారు చేసుకోగా, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టోర్నమెంట్ ప్రస్థానం ఈ ఓటమితో ముగిసింది.
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. సాయి సుదర్శన్ కేవలం 53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశారు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సైతం చెన్నై బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ 37 బంతుల్లోనే 64 పరుగులు చేసి అవుటయ్యాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వచ్చిన జోస్ బట్లర్ కేవలం 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో గుజరాత్ భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ పడగొట్టినప్పటికీ పరుగులు భారీగా సమర్పించుకున్నారు.
230 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మొదటి ఓవర్లోనే కోలుకోలేని షాక్ తగిలింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే సంజూ శాంసన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (16) ను కూడా సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఉర్విల్ పటేల్ (0) ను కూడా అవుట్ చేసి సిరాజ్ చెన్నై పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత మ్యాథ్యూ షార్ట్ (24) కొంతసేపు పోరాడినా రబడ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కార్తీక్ శర్మ (19) దురదృష్టవశాత్తూ శుభ్‌మన్ గిల్ అద్భుత త్రోకు రనౌట్ అయ్యాడు.
మిడిలార్డర్లో శివమ్ దూబే కేవలం 17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసి చెన్నై ఆశలు సజీవంగా ఉంచే ప్రయత్నం చేశాడు. అయితే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో దూబే ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత వచ్చిన అన్షుల్ కాంబోజ్ (19), డెవాల్డ్ బ్రెవిస్ (8)లను కూడా రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో అవుట్ చేసి చెన్నైని కోలుకోకుండా చేశాడు. ఆఖర్లో కాగిసో రబడ వరుస బంతుల్లో నూర్ అహ్మద్ (1), స్పెన్సర్ జాన్సన్ (0)లను అవుట్ చేసి 14వ ఓవర్లోనే చెన్నై ఇన్నింగ్స్‌కు తెరదించాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, రబడ 2 వికెట్లతో రాణించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
తాజావార్తలు
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్‌పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!