Ruturaj Gaikwad: “అలా చేసినందుకు నాకేమీ పశ్చాత్తాపం లేదు”.. చెన్నై ఘోర పరాజయంపై కెప్టెన్ రియాక్షన్..

Ruturaj Gaikwad Csk

Ruturaj Gaikwad Csk

Ruturaj Gaikwad: ఐపీఎల్ 2026 సీజన్‌ చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు నిరాశగా మారింది. నిన్న(గురువారం) గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఛేజింగ్ బరిలోకి దిగిన చెన్నై 140 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తమ జట్టు ఓటమిపై ఎంతో పరిణతితో, నిజాయితీగా స్పందించాడు. 230 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో వీలైనంత త్వరగా ఆ టార్గెట్‌ను రీచ్ అవ్వాలనేదే తమ వ్యూహమని గైక్వాడ్ చెప్పాడు. ప్రత్యర్థి జట్టుకున్న బలమైన బౌలింగ్ దాడిని తట్టుకుని 20 ఓవర్లలో 230 పరుగులు చేయడం ఎలాగూ అంత సులువు కాదని తమకు తెలుసని, అందుకే భయం లేకుండా మైదానంలోకి వెళ్లి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ ఒక ప్రయత్నం చేయాలని అనుకున్నట్లు తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అన్ని బ్యాటింగ్, బౌలింగ్‌లో తమ కంటే మెరుగ్గా రాణించి గెలిచిందని, ఆ క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని రుతురాజ్ ఒప్పుకున్నాడు.

టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదని గైక్వాడ్ స్పష్టం చేశాడు. మ్యాచ్ ప్రారంభంలో పిచ్ కొద్దిగా స్పాంజీగా (బంతి కాస్త నెమ్మదిగా రావడం) అనిపించిందని చెప్పాడు. అయితే ప్రత్యర్థి ఓపెనర్లు ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండి ఒక్కసారి జోరు అందుకుంటే వారిని ఆపడం చాలా కష్టమని, తాము పవర్‌ప్లేలో బౌలింగ్‌ పరంగా కొన్ని తప్పులు చేసి ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయామని అన్నాడు. అయినప్పటికీ మ్యాచ్ మధ్యలో వారిని కట్టడి చేసేందుకు కొన్ని అవకాశాలు వచ్చాయని, సరిగ్గా ప్లాన్ చేసి ఉంటే వారిని 200 పరుగుల లోపే పరిమితం చేయగలిగేవారమని, కానీ ఆ పని చేయడంలో ఈరోజు విఫలమయ్యామని అంగీకరించాడు.

ఈ ఐపీఎల్ సీజన్ మొత్తాన్ని విశ్లేషిస్తూ.. తమకు ఇదొక కఠినమైన ప్రయాణమని గైక్వాడ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా సీజన్ ఆరంభంలోనే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం దెబ్బతీసిందన్నాడు. జట్టును గాయాల సమస్యలు పదే పదే వేధించాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా జేమీ ఓవర్టన్, అలాగే ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ లాంటి కీలక ఆటగాళ్లు గాయాల వల్ల దూరం కావడం తమ ప్లేయింగ్ 12 సమతుల్యతను పూర్తిగా దెబ్బతీసిందని చెప్పాడు. దీనివల్ల గత మూడు మ్యాచ్‌ల్లో తాము ఒక బ్యాటర్ తక్కువగానో లేదా ఒక బౌలర్ తక్కువగానో ఆడాల్సి వచ్చిందని వివరించాడు. ప్రస్తుతం తమది ఒక యువ జట్టు అని, ఒక ట్రాన్సిషన్ (మార్పు) దశలో ఉన్నామనే వాస్తవాన్ని చాలామంది ఒప్పుకోరని రుతురాజ్ వ్యాఖ్యానించాడు. ఇలాంటి అత్యంత కఠినమైన లీగ్‌లో ఆడేందుకు తమ జట్టులో ఎక్కువ మందికి తగినంత అనుభవం లేదని చెప్పాడు. జట్టులోని దాదాపు ఎనిమిది నుంచి పది మంది ఆటగాళ్లు కనీసం 20 ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడలేదని, అయితే ఈ సీజన్ ద్వారా వారికి లభించిన ఎక్స్‌పోజర్ (అనుభవం) చాలా మంచిదని అభిప్రాయపడ్డాడు. తాము ఏయే విభాగాల్లో వెనుకబడి ఉన్నామో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడిందన్నాడు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ హోమ్ గ్రౌండ్ బయట ఆరు మ్యాచ్‌లు గెలవడం, అందులో కొన్ని అద్భుతమైన విజయాలు సాధించడం పట్ల గైక్వాడ్ సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టు ప్రదర్శన పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందన్నాడు.