Rishab Pant: అనుకున్నదే జరిగింది.. LSG కెప్టెన్సీ నుంచి రిషభ్ పంత్ ఔట్..

Rishab Pant

Rishab Pant

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే క్రికెట్ వర్గాల్లో ఒక సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది. లక్నో సూపర్ జాయింట్స్ (LSG) జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తప్పుకున్నట్లు వస్తున్న వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మెగా వేలంలో రికార్డు స్థాయి ధర పలికిన ఒక స్టార్ ఆటగాడు, సీజన్ ముగిసిన వెంటనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఐపీఎల్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. వేలంలో లక్నో ఫ్రాంచైజీ ఏకంగా రూ. 27 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి పంత్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. భారీ అంచనాలతో జట్టు పగ్గాలు చేపట్టిన పంత్, లక్నోను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాడని యాజమాన్యంతో పాటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

కానీ మైదానంలో ఫలితాలు మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా వచ్చాయి. ఈ సీజన్‌లో లక్నో సూపర్ జాయింట్స్ ప్రదర్శన అత్యంత పేలవంగా సాగింది. ఆడిన మ్యాచ్‌లలో కేవలం నాలుగింటిలో మాత్రమే ఆ జట్టు విజయం సాధించగలిగింది. వరుస ఓటములతో జట్టు పాయింట్ల పట్టికలో అందరికంటే దిగువన, చిట్టచివరి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో అనుభవమున్న పంత్ నాయకత్వంలో జట్టు ఈ స్థాయి పరాజయాన్ని మూటగట్టుకోవడం ఫ్రాంచైజీని తీవ్ర నిరాశకు గురిచేసింది. కెప్టెన్‌గా ఒత్తిడిని ఎదుర్కోవడంలో , జట్టును సరైన దిశలో నడిపించడంలో పంత్ విఫలమయ్యాడనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లీగ్ ముగిసిన తర్వాత పంత్ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

×
×
Ad

ఈ విషయాన్ని పంత్ అధికారికంగా లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యానికి తెలియజేయగా.. వారు కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం. అయితే ఇక్కడే ఒక పెద్ద సస్పెన్స్ నెలకొంది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న పంత్, రాబోయే సీజన్లలో లక్నో జట్టులో కేవలం ఒక ఆటగాడిగా కొనసాగుతాడా లేదా అసలు జట్టునుంచే పూర్తిగా వైదొలుగుతాడా అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఒకవేళ అతను కేవలం ప్లేయర్‌గా కొనసాగడానికి ఇష్టపడకపోతే, ట్రేడింగ్ విండో ద్వారా మరో జట్టులోకి మారే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రూ. 27 కోట్ల భారీ ధర కలిగిన ఆటగాడు జట్టులో ఉంటూ కెప్టెన్సీ చేయకపోతే, అది ఫ్రాంచైజీ ఆర్థిక వ్యూహాలపై కూడా ప్రభావం చూపుతుంది. లక్నో యాజమాన్యం కూడా జట్టును మళ్లీ గాడిలో పెట్టడానికి కొత్త ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే రోజుల్లో పంత్ భవిష్యత్తు, లక్నో జట్టు కొత్త కెప్టెన్ ఎవరనే విషయాలపై ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగేలా కనిపిస్తోంది.