Site icon NTV Telugu

Praful Hinge: “రాత్రికి రాత్రే స్టార్‌డమ్”.. 4 వేల నుంచి 5 లక్షలకు.. 12 గంటల్లోనే ప్రఫుల్ హింగే ఫాలోయింగ్ బీభత్సం..

Praful Hinge Ipl

Praful Hinge Ipl

Praful Hinge: ప్రఫుల్ హింగే.. మొన్న జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాజస్థాన్ రాయల్స్(RR) మ్యాచుకు ముందు ఈ పేరు చాలా మందికి తెలియదు. ఈ యువకుడికి ఎస్‌ఆర్‌హెచ్ ఒక్క అవకాశం ఇచ్చింది. మొదటి అవకాశాన్నే చక్కగా వినియోగించుకున్నాడు ప్రఫుల్ హింగే. మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు సహా పూర్తి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి అనేక రికార్డులు నెలకొల్పాడు. క్రికెట్ ప్రపంచానికి తన పేరును పరిచయం చేసుకున్నాడు. అయితే.. ప్రఫుల్ హింగే ఈ మ్యాచ్‌తో ఒక్కసారిగా ఓవర్‌ నైట్ స్టార్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఈ యువ ప్లేయర్‌కు ఆదరణ తారా స్థాయికి చేరుకుంది. కేవలం 24 గంటల క్రితం వరకు విదర్భ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతూ అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ యువకుడు, ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. సోషల్ మీడియాలో క్రేజ్ రాత్రికి రాత్రే పెరిగి పోయింది. మ్యాచ్‌కు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 4,000 మంది ఫాలోవర్లు ఉన్న ప్రఫుల్‌కు, మ్యాచ్ ముగిసిన 12 గంటల వ్యవధిలోనే ఆ సంఖ్య ఏకంగా 5.15 లక్షలకు చేరుకోవడం విశేషం. నిన్నటి వరకు సాధారణ క్రికెటర్ అయిన ప్రఫుల్, నేడు భారత క్రికెట్‌లో ఒక ఆశాకిరణంగా ఎదిగాడు.

READ MORE: Rahasya Gorak: కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ పై.. రహస్య గోరఖ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

ఇక ప్రఫుల్ హింగే నేపథ్యం చూస్తే.. 13 ఏళ్ల వయసులో లెదర్ బాల్ క్రికెట్ గురించి ఏమీ తెలియకుండానే ఆట మొదలుపెట్టాడు. తండ్రి ప్రోత్సాహంతో క్లబ్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ అద్భుత ప్రదర్శనను తన కుటుంబానికి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. మ్యాచ్ అనంతరం ప్రఫుల్ తన సక్సెస్ సీక్రెట్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నేను అరంగేట్రం మ్యాచ్‌లో 4 నుంచి 5 వికెట్లు తీస్తానని ఎక్కడో రాసి పెట్టుకున్నాను. పవర్‌ప్లేలో ఆధిపత్యం చెలాయించాలని ముందే అనుకున్నాను. సంకల్ప బలం (Manifestation) మీద నాకు నమ్మకం ఉంది” అని తెలిపాడు. అలాగే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వికెట్ గురించి చెబుతూ.. అతడిని మొదటి బంతికే బౌన్సర్‌తో అవుట్ చేయాలని మా బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్‌తో కలిసి ప్లాన్ చేశానని, అది అనుకున్నట్లుగానే జరిగిందని సంతోషం వ్యక్తం చేశాడు.

Exit mobile version