Players Caught Vaping During Match: ఐపీఎల్ 2026లో మరో వివాదం సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్ రాయల్స్( RR) కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ‘వేపింగ్’ (ఈ-సిగరెట్ తాగడం) చేస్తూ కెమెరాకు చిక్కాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీసీసీఐ వరకు ఈ వీడియో చేరే ఉంటుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తోంది. 16వ ఓవర్ నడుస్తోంది. ఈ తరుణంలో పరాగ్ తన సహచర ఆటగాళ్లు ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ పక్కన కూర్చుని క్యాజువల్‌గా వేపింగ్ చేస్తూ కనిపించాడు. లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లోనే ఈ దృశ్యాలు కనిపించడంతో అభిమానులు, క్రీడా విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మ్యాచ్ జరుగుతుండగా.. ఈ-సిగరెట్ తాగడం, కెమెరాలకు చిక్కడం ఇది కొత్తేం కాదు.. గతంలోనూ ఇలా చాలా సార్లు జరిగింది. ఇంతకీ ఎవరు వేపింగ్ చేస్తూ పట్టుబడ్డారు? ఆ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం..
క్రికెట్ చరిత్రలో ఆటగాళ్లు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2020 ఐపీఎల్ సమయంలో రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ డ్రెస్సింగ్ రూమ్‌లో పొగ వదులుతూ కెమెరాకు దొరికిపోయాడు. అలాగే ఈ ఏడాది ఎస్‌ఏ20 (SA20) లీగ్‌లో ఏబీ డివిలియర్స్ సైతం విఐపీ స్టాండ్స్‌లో వేపింగ్ చేస్తూ కనిపించగా, బిగ్ స్క్రీన్ మీద తనను తాను చూసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కేవలం వేపింగ్ మాత్రమే కాదు, కొందరు దిగ్గజ ఆటగాళ్లు ఏకంగా ధూమపానం చేస్తున్నట్లు గతంలో అంగీకరించారు. 2015 ప్రపంచకప్ సెమీఫైనల్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న సమయంలో తాను టాయిలెట్‌లో సిగరెట్ తాగానని బ్రెండన్ మెకల్లమ్ ఒప్పుకోగా, 2019 ప్రపంచకప్ ఫైనల్ వేళ ఇంగ్లాండ్ స్టార్ బెన్ స్టోక్స్ కూడా లార్డ్స్ వాష్ రూమ్‌లో స్మోక్ చేసినట్లు వెల్లడించాడు. ఇక ఈ సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడ హోటల్ బాల్కనీలో సిగరెట్ తాగుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే అది స్టేడియం వెలుపల జరిగిన ఘటన కాబట్టి పెద్దగా రచ్చ కాలేదు. కానీ ఇప్పుడు రియాన్ పరాగ్ లైవ్ మ్యాచ్‌లో అదీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలా చేయడం ఐపీఎల్ నిబంధనల అమలుపై చర్చకు దారితీస్తోంది.
