Site icon NTV Telugu

KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..

Kl Rahul

Kl Rahul

ఐపీఎల్ 2026 సీజన్‌లో శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 47 బంతుల్లోనే శతకాన్ని బాదిన రాహుల్, ప్రస్తుతం 145 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఐపీఎల్ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆవిష్కరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తరఫున ఒక బ్యాటర్ సాధించిన అత్యున్నత వ్యక్తిగత స్కోరుగా ఇది రికార్డు సృష్టించింది.

పంత్ రికార్డు కనుమరుగు..
గతంలో ఢిల్లీ తరఫున అత్యధిక స్కోరు రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2018లో ఇదే మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంత్ 128 పరుగులు చేయగా, రాహుల్ తన తాజా ఇన్నింగ్స్‌తో ఆ మార్కును అధిగమించి DC చరిత్రలో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. రాహుల్ కెరీర్‌లో ఇది ఆరవ ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం.

వేగవంతమైన సెంచరీ…
రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీని ఈ మ్యాచ్‌లో నమోదు చేశాడు. గతంలో 2022లో ముంబై ఇండియన్స్‌పై 56 బంతుల్లో సెంచరీ చేయగా, ఇప్పుడు దానిని 47 బంతుల్లోనే పూర్తి చేసి తన దూకుడును చాటాడు. 12 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

అభిషేక్ శర్మ రికార్డు బద్ధలు..
ఈ ఇన్నింగ్స్‌లో రాహుల్ కేవలం ఢిల్లీ రికార్డులనే కాదు, ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 141 విషయంలో అభిషేక్ శర్మ నెలకొల్పిన రికార్డులను కూడా బద్ధలు కొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.

ఢిల్లీ క్యాపిటల్స్ జోరు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్ నిర్ణయాన్ని రాహుల్ సరైనదని నిరూపించాడు. నితీష్ రాణా (90) అందించిన సహకారంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. పట్టికలో ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీకి, టేబుల్ టాపర్స్ పంజాబ్‌పై రాహుల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. రాహుల్ ఫామ్ రాబోయే మ్యాచ్‌ల్లో ఢిల్లీకి కీలక మారనుంది. తన క్లాస్ బ్యాటింగ్‌తో గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ ప్రేక్షకులను మైమరపించాడు. రాహుల్ సృష్టించిన ఈ సరికొత్త రికార్డులపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

Exit mobile version