IPL Ticket Scam Hyderabad: ఐపీఎల్ టికెట్ల స్కామ్ బట్టబయలు.. అభిమానులకు పోలీసులు హెచ్చరికలు!

Ipl 2026 Ticket Scam Hyderabad

Ipl 2026 Ticket Scam Hyderabad

IPL Ticket Scam Hyderabad: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మే 3న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ను ఆసరాగా చేసుకుని సాగుతున్న భారీ టికెట్ల కుంభకోణాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి (3/36) అద్భుత ప్రదర్శనతో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ, మైదానం వెలుపల జరిగిన ఈ దందా ఇప్పుడు చర్చనీయాంశమైంది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ నెట్‌వర్క్‌పై ఉప్పల్ పోలీసులు జరిపిన మెరుపు దాడిలో ముగ్గురు నిందితులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరు కేవలం టికెట్లను ఎక్కువ ధరకు అమ్మడమే కాకుండా, అత్యంత ఖరీదైన కాంప్లిమెంటరీ టికెట్ల కోసం ఏకంగా వీవీఐపీల పేర్లను వాడుకోవడం గమనార్హం. జడ్జీలు, మంత్రులు, గవర్నర్ల వంటి ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తుల పేర్లతో నకిలీ లెటర్ హెడ్స్‌ను సృష్టించి, క్రికెట్ అసోసియేషన్ల నుంచి సుమారు రూ.22,000 విలువైన టికెట్లను అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది. ఇలా ఉచితంగా పొందిన టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

మల్కాజిగిరి డీసీపీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుల నుంచి ఒక మహీంద్రా థార్ వాహనం, ఐదు ఐపీఎల్ టికెట్లు, ఐదు మొబైల్ ఫోన్లతో పాటు ఫోర్జరీ చేసిన వీవీఐపీ లెటర్ హెడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా ఉంచిన పోలీసులు, బందోబస్తు విధుల్లో ఉండగానే ఈ ముఠాను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అనధికారిక వ్యక్తుల దగ్గర లేదా బ్లాక్ మార్కెట్‌లో టికెట్లు కొనుగోలు చేయవద్దని, అలా చేస్తే డబ్బులు పోవడమే కాకుండా చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కేవలం అధికారిక మార్గాల ద్వారానే టికెట్లు తీసుకోవాలని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.