IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..

Ipl 2026

Ipl 2026

IPL 2026: ఐపీఎల్‌లో ఏదైనా సాధ్యం. కొత్త బౌలర్లు, బ్యాటర్లకు ఈ సిరీస్ ఓ సువర్ణ అవకాశంగా చెప్పాలి. ఇక ఈ సీజన్ మాత్రం బౌలర్లకు ఓ పీడకలలా మారుతోంది. స్టేడియంలో పరుగుల వరద పారుతుండటంతో ఏ స్కోరూ సేఫ్ కాదని అర్థమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏకంగా 264 పరుగులు చేసినా పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోవడం, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 243 పరుగులు చేసి ఓటమిని చవిచూడటం చూస్తుంటే బ్యాటర్ల వీరవిహారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ అలవోకగా ఛేజ్ చేసింది. చిత్రమేమిటంటే.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లను విజయవంతంగా ఛేజ్ చేసిన టాప్-5 మ్యాచ్‌లలో మూడు ఈ ఒక్క సీజన్ లోనే నమోదయ్యాయి.

ఐపీఎల్‌లో జరుగుతున్న ఈ పరుగుల వేటను చూసి ఐస్‌లాండ్ క్రికెట్ తనదైన శైలిలో సెటైర్లు వేసింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌లో ఏదైనా జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి సేఫ్ జోన్‌లో ఉండాలంటే కనీసం 350 పరుగులు చేయాలి’ అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సీజన్‌లో కేవలం 41 మ్యాచ్‌లు ముగిసే సమయానికే 10 సార్లు 200కు పైగా టార్గెట్లు ఛేజ్ అయ్యాయి. ఇది ఒక సరికొత్త ఐపీఎల్ రికార్డ్. ఇంకా ఈ సీజన్‌లో 33 మ్యాచ్‌లు మిగిలే ఉండటం విశేషం. గత ఏడాది అంటే 2025లో మొత్తం 74 మ్యాచ్‌ల్లో 9 సార్లు మాత్రమే ఈ ఘనత నమోదైతే, ఈసారి సగం సీజన్‌కే ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. గత రెండు సీజన్లలో కలిపి జరిగిన 19 భారీ రన్ ఛేజ్‌లలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే చివరి ఓవర్ వరకు వెళ్లాయంటే, బ్యాటర్లు ఎంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో 2023లో 8 సార్లు, 2024లో 6 సార్లు మాత్రమే 200+ స్కోర్లు ఛేజ్ అయ్యాయి.