ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు చివరి దశకు చేరుకోవడంతో.. పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. లీగ్ దశ ముగియడానికి రెండు వారాల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉన్నా.. ఇప్పటివరకు ఒక్క జట్టు కూడా అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు 11 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాయి. పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌లలో 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) జట్లు 12 పాయింట్లతో వరుసగా ఐదో, ఆరో స్థానాల్లో నిలిచాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లకు కూడా ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా ముగియలేదు. ఢిల్లీకి 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు ఉండగా.. కేకేఆర్ 10 మ్యాచ్‌ల్లో 9 పాయింట్లతో ఉంది. అయితే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నాయి. ప్రతి జట్టు లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడనుండటంతో చివరి వరకు సమీకరణాలు మారే అవకాశం ఉంది.
ఐపీఎల్ 10 జట్ల టోర్నీగా మారిన తర్వాత ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడానికి సాధారణంగా 16 పాయింట్లను ‘మ్యాజిక్ నంబర్’గా భావిస్తున్నారు. 2022లో ఆర్సీబీ, 2023లో ముంబై, 2025లో మరోసారి ముంబై 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ చేరాయి. అయితే 2024లో మాత్రం 14 పాయింట్లతో నాలుగు జట్లు సమానంగా నిలిచాయి. ఆ సమయంలో మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. అధికారిక ప్లేఆఫ్స్‌కు పాయింట్స్ 18 అని తెలిసిన విషయమే.
ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ల అంచనాల ప్రకారం.. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు 80 శాతం ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌కు 62.5 శాతం అవకాశం ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్‌కు 42.7 శాతం, రాజస్థాన్ రాయల్స్‌కు 41.8 శాతం అవకాశాలు ఉన్నట్లు అంచనా. ఇక కేకేఆర్‌కు కేవలం 11.6 శాతం, ఢిల్లీ క్యాపిటల్స్‌కు 1.2 శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, జీటీ టీమ్స్ ప్లేఆఫ్స్‌కు చేరడం దాదాపుగా ఖాయం. ముగిలిన ఒక్క స్థానం కోసం పంజాబ్, చెన్నై, రాజస్థాన్ పోటీ పడనున్నాయి. ఈ మూడింటిలో పంజాబ్ రేసులో ముందుంది. చూడాలి మరి ఏ టీమ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుతాయో.
