IPL 2026 Playoffs Scenario: గుజరాత్ ఘన విజయం.. తగ్గిన ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఛాన్సెస్.. సీఎస్‌కేకు ప్లస్!

  • మరింత ఆసక్తికరంగా ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు
  • గుజరాత్ ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖాయం
  • తగ్గిన ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఛాన్సెస్
SRH and RCB

SRH and RCB

IPL 2026 playoffs qualification scenario: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్‌ 82 పరుగుల భారీ విజయం సాధించి ప్లేఆఫ్స్ దిశగా దూసుకెళ్లింది. ఈ విజయంతో గుజరాత్ 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లకు చేరుకుని.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సాధారణంగా ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే 18 పాయింట్స్ అవసరం. అయితే 16 పాయింట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు ‘మ్యాజిక్ నంబర్’గా భావిస్తారు. దీంతో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖాయం అయినట్లే.

ఈ మ్యాచ్‌కు ముందు ప్లేఆఫ్స్ అవకాశాల్లో బలంగా కనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇప్పుడు భారీ దెబ్బ తగిలింది. ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్ అవకాశాలు 80 శాతం నుంచి 65.7 శాతానికి పడిపోయాయి. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాన్సెస్ కూడా స్వల్పంగా తగ్గాయి. ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు 80.1 శాతం నుంచి 79.7 శాతానికి చేరాయి. అయితే నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ అవకాశాలు 62.5 నుంచి 62.7 శాతానికి పెరిగాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఛాన్సెస్ 42.7 నుంచి 42.8 శాతానికి స్వల్పంగా పెరగడం సీఎస్‌కే అభిమానులకు ఊరట అనే చెప్పాలి.

మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ 44 బంతుల్లో 61 పరుగులతో జట్టును ఆదుకోగా.. సుందర్ 33 బంతుల్లో 50 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ప్రఫుల్ హింగే రెండు వికెట్లు తీశాడు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ చేతులెత్తేసింది. రబాడ, హోల్డర్ హీరో 3 వికెట్లు పడగొట్టారు. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున కమిన్స్ చేసిన 19 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. ఈ ఘన విజయంతో గుజరాత్ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. దాంతో ప్లేఆఫ్స్‌కు చేరే జట్లపై ఇప్పుడు ఉత్కంఠ మరింత పెరిగింది. చివరి దశ మ్యాచ్‌లు ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసును మరింత హీట్ ఎక్కించనున్నాయి.