IPL 2026 Playoffs Chances: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కొన్ని జట్లు దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నప్పటికీ.. మిగిలిన స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల భవితవ్యం ఇప్పుడు మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంది.
ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాజత్ పటిదార్ సారథ్యంలో ఆర్సీబీ ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తూ టాప్-4కు చేరువైంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు దాదాపు అర్హత సాధించినట్లే. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని జట్టు సమిష్టిగా రాణిస్తూ ఈ సీజన్‌లో బలమైన జట్లలో ఒకటిగా నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)కు బలమైన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం సాధించినా.. ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో ఆరెంజ్ ఆర్మీ కీలక మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేస్తూ ముందుకు సాగుతోంది.
అయితే అసలు పోటీ మాత్రం నాలుగో స్థానం కోసం జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ (13 పాయింట్స్), చెన్నై సూపర్ కింగ్స్ (12 పాయింట్స్), రాజస్థాన్ రాయల్స్ (12 పాయింట్స్) జట్లు ప్రస్తుతం 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తొలి దశలో అద్భుత ప్రదర్శన చేసిన పంజాబ్.. ఇప్పుడు వరుసగా నాలుగు ఓటములతో ఒత్తిడిలో పడింది. ఇంకా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీతో కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు విజయాలు సాధించకపోతే ప్లేఆఫ్స్ ఆశలు కష్టమవుతాయి.
రాజస్థాన్ రాయల్స్‌కు కూడా మిగిలిన ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లతో జరగబోయే మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలవాల్సి ఉంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే.. వరుస విజయాలు సాధించాల్సిందే. మూడు మ్యాచ్‌ల్లో (లక్నో, హైదరాబాద్, గుజరాత్) కనీసం రెండు గెలవాలి. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ వరుస విజయాలతో కంబ్యాక్ ఇచ్చినప్పటికీ.. తాజా ఓటమితో వనకపడిపోయింది. ఈ సీజన్‌లో నెట్ రన్‌రేట్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్లలో 16 పాయింట్లతో జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి పలు జట్లు సమాన పాయింట్లతో ముగించే అవకాశం ఉండటంతో.. నెట్ రన్‌రేట్ కీలకంగా మారనుంది. దీంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు చివరి లీగ్ మ్యాచ్ వరకు ఉత్కంఠభరితంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
