IPL 2026 Final: ఆర్సీబీ vs జీటీ హై-వోల్టేజ్ మ్యాచ్.. ఫైనల్‌కు డిసైడ్ చేసే మూడు ప్లేయర్స్ బ్యాటిల్స్‌ ఇవే!

  • టైటిల్ కోసం తలపడనున్న ఆర్సీబీ, జీటీ
  • మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే మూడు ప్లేయర్ బ్యాటిల్స్‌
  • విరాట్ కోహ్లీ vs కగిసో రబాడా, జేసన్ హోల్డర్
  • శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ vs భువనేశ్వర్ కుమార్
Ipl 2026 Final Key Battles

Ipl 2026 Final Key Battles

IPL2026 Final Key Battles: రెండు నెలలకు పైగా క్రికెట్ అభిమానులను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 విజేత గుజరాత్ టైటాన్స్ (జీటీ) టైటిల్ కోసం తలపడనున్నాయి. రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుండగా.. ఫైనల్ కోసం ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ, జీటీ జట్లు పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నాయి. ఒకవైపు రజత్ పాటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్‌పై కన్నేయగా.. మరోవైపు శుభ్‌మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ రెండోసారి ఛాంపియన్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ హై-వోల్టేజ్ ఫైనల్‌లో మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే మూడు కీలక ప్లేయర్ బ్యాటిల్స్‌పై అందరి దృష్టి నిలిచింది. మూడు కీ ప్లేయర్స్ బ్యాటిల్స్‌ ఏంటో ఓసారి చూద్దాం.

×
×
Ad

విరాట్ కోహ్లీ vs కగిసో రబాడా, జేసన్ హోల్డర్:
ఆర్సీబీ విజయావకాశాలు ఎక్కువగా విరాట్ కోహ్లీ ప్రదర్శనపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఫైనల్‌లో కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు. అయితే గుజరాత్ పేస్ బౌలర్లు కగిసో రబాడా, జేసన్ హోల్డర్ అతడికి గట్టి సవాల్ విసరనున్నారు. గణాంకాల పరంగా చూస్తే హోల్డర్ ఇప్పటివరకు కోహ్లీని నాలుగు సార్లు ఔట్ చేశాడు. రబాడా అయితే ఐదు సార్లు కోహ్లీ వికెట్ తీసుకున్నాడు. దీంతో ఈ పోరు ఫైనల్‌లో అత్యంత ఆసక్తికరమైన సమరంగా మారనుంది. ఒత్తిడిని తట్టుకుని కోహ్లీ ఎలా ఆడుతాడన్నది కీలకంగా మారింది.

శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ vs భువనేశ్వర్ కుమార్:
గుజరాత్ టైటాన్స్ విజయాల్లో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై ఈ జోడీ తొలి వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఫైనల్‌కు చేర్చింది. అయితే ఫైనల్‌లో వీరికి ఆర్సీబీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నుంచి కఠిన పరీక్ష ఎదురుకానుంది. భువీ ఇప్పటివరకు గిల్‌ను ఆరు సార్లు, సుదర్శన్‌ను ఏడు సార్లు ఔట్ చేశాడు. కొత్త బంతితో స్వింగ్‌ను రాబట్టే భువనేశ్వర్.. జీటీ ఓపెనర్లను త్వరగా పెవిలియన్‌కు పంపగలిగితే మ్యాచ్‌పై ఆర్సీబీ పట్టు సాధించే అవకాశం ఉంటుంది.

దేవదత్ పడిక్కల్ vs రషీద్ ఖాన్:
ఫైనల్‌లో మరో ఆసక్తికర పోరు ఆర్సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్, గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మధ్య జరగనుంది. సీజన్ ఆరంభంలో అంతగా ప్రభావం చూపకపోయినా.. రషీద్ కీలక దశలో మళ్లీ తన లయను అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 19 వికెట్లు పడగొట్టి జీటీ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పడిక్కల్‌పై రషీద్‌కు మంచి రికార్డు ఉంది. గతంలో అతడిని ఐదు సార్లు ఔట్ చేశాడు. దీంతో ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్నది మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రషీద్‌ను సమర్థంగా ఎదుర్కొంటే పడిక్కల్ ఆర్సీబీకి కీలక పరుగులు అందించగలడు.

ఫైనల్‌లో తేడా తెచ్చే పోరులు:
ఐపీఎల్ ఫైనల్స్‌లో చిన్న చిన్న క్షణాలే మ్యాచ్‌ను మలుపుతిప్పుతాయి. కోహ్లీ-రబాడా పోరు, గిల్-సుదర్శన్‌లకు భువనేశ్వర్ విసిరే సవాల్, పడిక్కల్-రషీద్ మధ్య జరిగే సమరం ఈ గ్రాండ్ ఫైనల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కీలక బ్యాటిల్స్‌లో ఎవరు విజయం సాధిస్తారో వారిదే చివరికి ఐపీఎల్ 2026 ట్రోఫీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.