NTV Telugu Site icon

IPL 2024 Playoffs: ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరం.. మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ!

Ipl

Ipl

IPL 2024 Playoffs Scenario after GT vs KKR Match: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారింది. లీగ్ దశ తుది అంకానికి చేరుకున్నా.. ఇంకా మూడు బెర్తులు ఖరారు కాలేదు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్‌ టైటాన్స్‌ అధికారికంగా ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించగా.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మాత్రమే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారైంది. ఇక మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ ఆరు జట్లలో ఏ టీమ్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

RR IPL 2024 Playoffs Chances:
రాజస్థాన్‌ రాయల్స్ 12 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించింది. ఇప్పటికే రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ బెర్తుకు ఢోకా లేదు. చివరి 2 మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా.. అధికారిక బెర్తు ఖాయమవుతుంది. రెండూ గెలిస్తే అగ్రస్థానం సొంతమవుతుంది. ఒకవేళ పంజాబ్‌, కోల్‌కతాలతో ఆడే చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా రాజస్థాన్ ముందంజ వేస్తుంది. అయితే చిత్తుగా ఓడకుండా చూసుకుంటే సరిపోతుంది.

SRH IPL 2024 Playoffs Scenario:
రాజస్థాన్‌ రాయల్స్ తర్వాత మెరుగైన అవకాశాలు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఉన్నాయి. సన్‌రైజర్స్ 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది. గుజరాత్‌, పంజాబ్‌లతో ఆడే రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌ చేరుతుంది. నెట్‌ రన్‌రేట్‌ బాగుంది కాబట్టి ఒకటి నెగ్గినా ముందంజ వేస్తుంది. అయితే రెండు మ్యాచ్‌లూ ఓడితే మాత్రం.. ఇతర మ్యాచ్‌ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.

CSK IPL 2024 Playoffs Chances:
చెన్నై సూపర్ కింగ్స్‌కు కూడా ప్లేఆఫ్స్‌ చేరేందుకు మంచి అవకాశం ఉంది. 13 మ్యాచ్‌ల్లో 7 నెగ్గిన చెన్నై.. చివరి మ్యాచ్‌లో బెంగళూరును ఓడిస్తే ప్లేఆఫ్స్‌ చేరుతుంది. యెల్లో ఆర్మీ నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది కాబట్టి ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌ బెర్తు సొంతం అవవుతుంది. ఒకవేళ బెంగళూరుపై ఓడితే.. ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

LSG IPL 2024 Playoffs Scenario:
లక్నో సూపర్ జెయింట్స్ 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో ప్లేఆఫ్స్‌ రేసులో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో (ఢిల్లీ, ముంబై) గెలిస్తే ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉంటాయి. అయితే నెట్‌ రన్‌రేట్‌ భారీగా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. రన్‌రేట్‌ మైనస్‌లో ఉంది కాబట్టి ఒక్క మ్యాచ్ ఓడినా ముందంజ వేయడం కష్టమే. ఢిల్లీపై ఓడితే ఇంటికి వెళ్లాల్సిందే.

Also Read: IPL 2024 Playoffs: వర్షం వచ్చింది.. గుజరాత్‌ టైటాన్స్ కథ ముగిసింది!

DC IPL 2024 Playoffs Chances:
ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించింది. నెట్‌ రన్‌రేట్‌లో బాగా వెనుకబడి ఉంది. చివరి మ్యాచ్‌లో లక్నోపై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఓడితే ఢిల్లీ కథ ముగుస్తుంది.

RCB IPL 2024 Playoffs Scenario:
బెంగళూరు అనూహ్యంగా ప్లేఆఫ్స్‌ రేసులోకి వచ్చింది. 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు అందుకుంది. బెంగళూరు చివరి మ్యాచ్‌లో చెన్నైపై గెలిచి.. సమీకరణాలు కలిసి వస్తే ముందంజ వేయొచ్చు. నెట్‌ రన్‌రేట్‌మెరుగ్గా ఉండడం కలిసొచ్చే అంశం. హైదరాబాద్‌, ఢిల్లీ, లక్నో జట్లలో ఒక్కటే ముందంజ వేసి రెండు జట్లు నిష్క్రమిస్తే.. అప్పుడు చెన్నై, బెంగళూరు మ్యాచ్‌ కీలకం అవుతుంది.