NTV Telugu Site icon

MS Dhoni-Fan: నీ బాధ్యత నాది.. నీకేమీ కానివ్వను! అభిమానికి ఎంఎస్ ధోనీ హామీ

Ms Dhoni Fan

Ms Dhoni Fan

Fan Reveals MS Dhoni’s Promise: ఐపీఎల్ 2024లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ మధ్యలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలో ఉండగా.. ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చి మహీ పాదాలను తాకాడు. అనంతరం ధోనీ అతడిని హత్తుకుని.. మాట్లాడాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ అభిమానితో ధోనీ ఏం మాట్లాడాడో ఎవరికీ తెలియలేదు. తాజాగా మహీ తనతో ఏం మాట్లాడాడో సదరు అభిమాని స్వయంగా చెప్పాడు.

ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంఎస్ ధోనీ అభిమాని మాట్లాడుతూ… ‘నా పేరు జై జానీ. ఎంఎస్ ధోనీకి పెద్ద అభిమానిని. మహీ ఒక లెజెండ్‌. చెన్నై, గుజరాత్‌ మ్యాచ్‌ జరుగుతుండగా ధోనీ మైదానంలోకి వచ్చారు. ఏది ఏమైనా అతడిని కలవాలనిపించింది. అందుకే ఫెన్సింగ్ దూకి మైదానంలోని ధోనీ దగ్గరకు పరిగెత్తా. మహీ భాయ్ పరిగెత్తగానే వెళ్లిపోతాడేమో అనుకున్నాను. చేయి పైకెత్తి గట్టిగా సార్ అని అరిచాను. అప్పుడు నేను సరదాగా పరిగెత్తాను అని నాతో అన్నారు. ఆయన పాదాలను తాకా. ధోనీని చూడగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని తెలిపాడు.

Also Read: Riyan Parag: అహంకారం ఏమీ లేదు.. భారత జట్టుకు తప్పకుండా ఆడతా!

‘మాట్లాడుతుండగా నాకున్న సమస్యను ఎంఎస్ ధోనీ పసిగట్టారు. ఎందుకు అంత వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నావ్‌ అని అడిగారు. నాకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని చెప్పా. ‘నువ్వేమీ భయపడకు. నీకు నేనున్నా. నీ సర్జరీ బాధ్యత నాది. నీకేమీ కానివ్వను’ అని మహీ భాయ్ ధైర్యం ఇచ్చారు. ఇతడిని జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లండి. ఏమీ అనొద్దు అని సిబ్బందికి చెప్పారు. మైదానంలో దాదాపు 21 సెకన్ల పాటు ధోనీతో మాట్లాడా. ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను’ అని జై జానీ చెప్పాడు. జై జానీ మహీ గురించి చెప్పైనా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ మంచి మనసుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.