Heinrich Klaasen: ఆటో ప్రయాణం, రెస్టారెంట్‌.. సాధారణ వ్యక్తిలా హైదరాబాద్ చుట్టేస్తున్న కాటేరమ్మ కొడుకు!

  • విధ్వంసక బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న క్లాసెన్
  • 9 ఇన్నింగ్స్‌లలో 414 పరుగులు
  • సాధారణ వ్యక్తిలా హైదరాబాద్ చుట్టేస్తున్న క్లాసెన్
Sam

Sam

Heinrich Klaasen in Hyderabad Restaurant: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తరఫున ఆడుతున్న స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మైదానంలో తన విధ్వంసక బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో 9 ఇన్నింగ్స్‌లలో 414 పరుగులు చేసి.. టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. 59.14 సగటు, 157.41 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు. ముంబైపై 30 బంతుల్లోనే 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్‌ల మధ్యలో లభించిన విరామాన్ని కాటేరమ్మ కొడుకు క్లాసెన్ కుటుంబంతో కలిసి సరదాగా గడిపాడు.

ఏప్రిల్ 29న ముంబైతో ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్ ఆడింది. మే 3న ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతాతో తలపడనుంది. మ్యాచ్‌ల మధ్యలో లభించిన విరామాన్ని హెన్రిచ్ క్లాసెన్ కుటుంబం కోసం వెచ్చిస్తున్నాడు. తన కుమార్తె లాయా క్లాసెన్‌తో కలిసి హైదరాబాద్ నగరంలో చక్కర్లు కొట్టాడు. సాధారణంగా స్టార్ క్రికెటర్లు బయటికి వెళ్లేటప్పుడు ప్రత్యేక సౌకర్యాలు వినియోగించుకుంటారు. కానీ క్లాసెన్ మాత్రం సాధారణంగా ఆటోలో ప్రయాణిస్తూ నగర అందాలను ఆస్వాదించడం అభిమానులను ఆకట్టుకుంది. కుమార్తెతో కలిసి ఆటోలో కూర్చొని ప్రయాణిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో క్లాసెన్ ఎంతో సరదాగా, సింపుల్‌గా ఉన్నాడు.

హెన్రిచ్ క్లాసెన్ కుటుంబం హైదరాబాద్‌లోని ఒక రెస్టారెంట్‌లో కూడా కనిపించింది. కుటుంబంతో కలిసి సమయం గడపడం ఎంత ముఖ్యమో క్లాసెన్ మరోసారి చూపించాడు. మైదానంలో అగ్రశ్రేణి బౌలర్లను ధీటుగా ఎదుర్కొనే ఈ స్టార్ ప్లేయర్.. బయట మాత్రం సాధారణ వ్యక్తిలా జీవించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. క్లాసెన్ తన సింప్లిసిటీతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆటోలో కుమార్తెతో రెస్టారెంట్‌లో ఫ్యామిలీతో చక్కర్లు కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.