Heinrich Klaasen Jokes about His Kids: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైన క్లాసెన్ తన ఇన్నింగ్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ పెద్దగా టెన్షన్ పడలేదని తెలిపాడు. పరిస్థితిని అర్థం చేసుకుని రిస్క్ తీసుకోవాల్సిందేనని భావించానన్నాడు. మ్యాచ్ మోమెంటమ్ మార్చడానికి దూకుడుగా ఆడాల్సి వచ్చిందని ఎస్‌ఆర్‌హెచ్ హీరో క్లాసెన్ వివరించాడు.
‘ఓ సమయంలో మూడు వికెట్లు త్వరగా పడిపోయినప్పుడు పెద్దగా టెన్షన్ పడలేదు. ముఖ్యంగా కౌ కార్నర్ వైపు గ్యాప్ కనిపించడంతో ముందుగానే దాడి చేయాలని నిర్ణయించుకున్నా. పిచ్ చాలా బాగుంది. దాదాపు 10 ఓవర్ల పాటు ఓవరుకు 9-10 పరుగులు చేయాల్సిన పరిస్థితి. పైగా ముంబైకి మంచి బౌలింగ్ లైనప్ ఉంది. కాబట్టి మ్యాచ్ పరిస్థితిని మార్చడానికి ఛాన్స్ తీసుకోవాలని అనిపించింది. గత ఏడాది నుంచి నా ఎడమ భుజం కొంచెం ఇబ్బంది పెడుతోంది. అందుకే కౌ కార్నర్ వైపు అంత బలంగా ఆడలేకపోతున్నాను. బౌలర్లు ఎక్స్‌ట్రా కవర్ వైపు బంతులు వేయడం నాకు అనుకూలంగా మారింది. అందుకే ఆ ప్రాంతంలో ఇన్నర్-అవుట్ షాట్లు సులభంగా ఆడగలిగా’ అని క్లాసెన్ చెప్పాడు.
క్లాసెన్ తన వ్యక్తిగత జీవితంపై కూడా సరదాగా స్పందించాడు. ‘పెద్దగా సంబరాలు ఏం చేసుకోను. నేను ఎప్పుడూ వినమ్రంగానే ఉంటాను. రేపు మరలా కొత్త రోజు. ఇప్పుడు ఇంటికి వెళ్లి బేబీ ఏడవకుండా ఉండాలని కోరుకుంటున్నా (నవ్వుతూ). ఎందుకంటే ఇప్పుడు డాడీ డ్యూటీ మొదలవుతుంది. ఇక జట్టుకు సహాయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది గొప్ప విజయం. సొంత మైదానంలో కూడా ఇదే రీతిలో కొనసాగించాలని ఆశిస్తున్నాం. ముందే చెప్పినట్లే ఓపెనర్లు ఓవరుకు 15-16 పరుగులు చేస్తే మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి ఉండదు. నేను క్రీజులోకి వచ్చినప్పుడు దాదాపు ఓవరుకు 10 పరుగుల కన్నా తక్కువ అవసరం ఉండేది. అది ఓపెనర్ల అద్భుత ప్రదర్శన వల్లే సాధ్యమైంది’ అని క్లాసెన్ ప్రశంసించాడు.
‘మ్యాచ్ సమయంలో సలీల్ అరోరాతో మాట్లాడాను. ఓవరుకు 11-12 పరుగులు కావాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నాను. అప్పుడు అతను నేను హిట్ చేయొచ్చా? అని అడిగాడు. ఎలాంటి సందేహం లేకుండా హిట్ చేయి అని చెప్పాను. గేమ్‌ని ముగించు అన్నాను. సలీల్ ఇలా ఆడటం అద్భుతం. మేము ట్రైనింగ్‌లో ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. అతనిలో అపారమైన ప్రతిభ ఉంది. అతని కెరీర్ ఇలాగే ముందుకు సాగాలని ఆశిస్తున్నాను’ అని క్లాసెన్ చెప్పుకొచ్చాడు.
