Shivam Dube Will Get A place in the T20 World Cup 2024: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. భారీ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్నాడు. దూబే క్రీజులో ఉన్నాడంటే.. ఏ బౌలర్‌కి బంతిని ఇవ్వాలో ప్రత్యర్థి సారథికి అర్థం కావడం లేదు. ఇప్పటికే గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన దూబే.. మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
శివమ్ దూబే లక్నోపై 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. మొన్నటివరకు స్పిన్నర్లను టార్గెట్ చేసిన దూబే.. ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లను ఊచకోత కోశాడు. లక్నో పేసర్ యష్ ఠాకూర్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. యష్ వేసిన 16 ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. దూబే ఊచకోతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు దూబేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘దూబే ఏం ఆడుతున్నాడు’, ‘దూబేకు టీ20 ప్రపంచకప్ 2024 భారత జట్టులో చోటు పక్కా’ అని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: CSK vs LSG: ఉత్కంఠపోరులో లక్నో విజయం.. సెంచరీతో ఆదుకున్న స్టోయినీస్
17వ సీజన్‌లో ఆల్‌రౌండర్ శివమ్ దూబే అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన దూబే 51.83 సగటుతో 311 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో దూబేకు అవకాశం దక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హార్దిక్ పాండ్యా స్ధానంలో దూబేకు ఛాన్స్ ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరో 4-5 రోజులో ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. జూన్ 1 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
