Delhi Capitals History in IPL with 226 Chase: ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా రాజస్థాన్ 6 వికెట్లకు 225 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (90; 50 బంతుల్లో), ఫెరీరా (47 నాటౌట్; 14 బంతుల్లో) టాప్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడారు. 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్ (75; 40 బంతుల్లో), పాతుమ్ నిశాంక (62; 33 బంతుల్లో), నితీశ్ రాణా (33; 17 బంతుల్లో) ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ 2026లో ఢిల్లీకి ఇది నాలుగో విజయం కాగా.. ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది.
226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన రికార్డు అందుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే తమ అత్యధిక విజయవంతమైన చేజ్‌ను డీసీ నమోదు చేసింది. ఇంతకుముందు 2025లో విశాఖపట్నంలో లక్నో సూపర్ జెయింట్స్‌పై 210 పరుగులే ఇప్పటివరకు టాప్ చేజ్‌గా ఉంది. 2017లో ఢిల్లీ వేదికగా గుజరాత్ లయన్స్‌పై 209 పరుగులు, 2025లో పంజాబ్ కింగ్స్‌పై 207 పరుగుల లక్ష్యాలను ఢిల్లీ విజయవంతంగా ఛేజ్ చేసింది. ఇప్పుడు 226 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేయడంతో కొత్త రికార్డు సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో నమోదైన మరో విశేషం ఏమిటంటే.. రాజస్థాన్ రాయల్స్‌పై ఇది రెండో అత్యధిక విజయవంతమైన చేజ్. జైపూర్ మైదానంలో ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 229 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి టాప్‌లో నిలిచింది. ఈ రెండు మ్యాచ్‌ల గణాంకాలు చూస్తే.. జైపూర్ పిచ్‌పై భారీ చేజ్‌లు సాధ్యమేనని మరోసారి రుజువైంది. అయితే రాజస్థాన్ రాయల్స్‌కు జైపూర్ హోం గ్రౌండ్‌గా ఉన్నప్పటికీ.. ఇటీవలి కాలంలో ఫలితాలు అనుకూలంగా రావడం లేదు. 2025 నుంచి ఇప్పటివరకు జైపూర్‌లో ఆడిన 7 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లు ఓడిపోయింది. హోం గ్రౌండ్‌లోనే ఇన్ని పరాజయాలు ఎదుర్కొనడం రాయల్స్‌కు పెద్ద దెబ్బగా మారింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేస్‌లో తమ అవకాశాలను బలోపేతం చేసుకుంది. 9 మ్యాచ్‌ల్లో డీసీకి ఇది నాలుగో విజయం. ఢిల్లీ ఇంకా మరో నాలుగు విజయాలు సాధిస్తేనే అవకాశాలు ఉంటాయి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్‌లో ఆరు విజయాలు ఖాతాలో వేసుకుంది. కీలక సమయంలో ఓటమి చవిచూసి ఒత్తిడిలో పడింది. ఐపీఎల్ 2026 సీజన్ మరింత రసవత్తరంగా మారుతుండగా.. ఇలాంటి రికార్డు చేజ్‌లు అభిమానులకు థ్రిల్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నాయి.
