Delhi Capitals 1 Run Defeats in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఒక్క పరుగు పరుగు తేడాతో గెలిచిన లేదా ఓడిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. చాలా టీమ్స్ ఒక్క పరుగు తేడాతో ఓడాయి, అదే సమయంలో గెలిచాయి కూడా. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుకు మాత్రం ఈ ఒక్క పరుగు శాపంగా మారిందనే చెప్పాలి. అత్యంత స్వల్ప తేడాతో ఓటములు చవిచూడడంలో ఢిల్లీ ముందంజలో ఉంది. ఒక్క పరుగు తేడాతో ఓడిన మ్యాచ్‌లలో ఢిల్లీ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో మరే జట్టు కూడా ఇన్నిసార్లు ఒక్క రన్ తేడాతో ఓడిపోలేదు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క రన్ తేడాతో ఓడిన మ్యాచ్‌ల జాబితాను ఓసారి చూద్దాం. 2015లో చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై మొదటిసారి ఢిల్లీ ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. 2016లో ఢిల్లీ వేదికగా గుజరాత్ లయన్స్‌పై మరోసారి ఒక రన్ తేడాతో ఓటమి పాలైంది. 2021లో అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఒక్క పరుగు తేడాతో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
తాజాగా 2026లో గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా సాగగా.. చివరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ చివరికి ఢిల్లీకి మరోసారి నిరాశే మిగిలింది. ఈ గణాంకాలు చూస్తే ఢిల్లీ జట్టులో మ్యాచ్ ముగించే సామర్థ్యం లోపిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, చిన్న చిన్న పొరపాట్లతో భారీ మూల్యం తప్పడం లేదు. మొత్తానికి ఐపీఎల్‌లో అత్యధికంగా ఒక్క రన్ తేడాతో ఓడిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓ చెత్త రికార్డున ఖాతాలో వేసుకుంది. భవిష్యత్తులో ఈ రికార్డును మెరుగు పరుచుకుంటుందో లేదో చూడాలి.
