NTV Telugu Site icon

CSK vs SRH: ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడమే మా ఓటమికి కారణం కాదు: ప్యాట్ కమిన్స్

Pat Cummins

Pat Cummins

Pat Cummins On SRH Defeat vs CSK: టాస్ గెలిచి ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడం తమ ఓటమికి కారణం కాదని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. తమ బ్యాటింగ్ లైనప్‌ బాగుందని, ఛేజింగ్ చేస్తామని భావించే ఆ నిర్ణయం తీసుకున్నామన్నాడు. మేము త్వరగా పుంజుకుంటాము అని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం రాత్రి చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 78 పరుగుల తేడాతో ఓడిపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది.

మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటేనే గెలుస్తామన్నది నిజం కాదు. గెలవడానికి ఛేదన అత్యుత్తమ అవకాశం అనుకున్నాం. అందుకే టాస్ గెలిచాక బౌలింగ్ ఎంచుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోవాల్సి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్‌ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 210 పరుగులు చేయడానికి వారు బాగా కష్టపడ్డారు. మా బ్యాటింగ్ లైనప్‌ బాగుంది కాబట్టి.. గెలిచే అవకాశం ఉందని భావించాం. కానీ అలా జరగలేదు. ఈ టోర్నమెంట్‌లో మా ప్లేయర్స్ అందరూ ఎన్నో మ్యాచ్‌లలో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి గెలిపించారు’ అన్నాడు.

Also Read: RCB vs GT: ఆల్‌టైమ్ రికార్డ్.. 10 బంతుల్లోనే 50 రన్స్!

‘పిచ్ బాగుంది. మొదటి ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంది. మాకు అదే పరిస్థితి ఎదురైంది. మా బ్యాటింగ్ లైనప్ గురించి సంతోషంగా ఉన్నాం. ఈరోజు మాత్రమే మేం గెలవలేకపోయాం. మేము త్వరగా పుంజుకుంటాము. వచ్చే మ్యాచులలో మంచి ప్రణాళికలతో బరిలోకి దిగుతాం’ అని ప్యాట్ కమిన్స్ చెప్పాడు. ఐపీఎల్ 2024లో ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడి.. ఐదింటిలో గెలిచింది. ప్రస్తుతం 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన ఆరు మ్యాచులలో మూడు గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి.