CSK vs SRH Match Changed IPL 2026 Playoff Scenarios: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 18 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మిగిలిన మూడు స్థానాల కోసం గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు చెపాక్ వేదికగా జరగనున్న సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్.. ప్లేఆఫ్స్ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశముంది.
ప్రస్తుతం ఆర్సీబీ 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్ 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నా.. వరుసగా ఆరు ఓటములతో తీవ్ర ఒత్తిడిలో పడింది. చెన్నై, రాజస్థాన్ చెరో 12 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచాయి. ఢిల్లీ కూడా 12 పాయింట్లతో అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. నేడు చెపాక్‌లో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధిస్తే.. ఎస్‌ఆర్‌హెచ్‌తో పాటు గుజరాత్ టైటాన్స్ కూడా అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. అదే సమయంలో పంజాబ్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే. ఇప్పటికే వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న పీబీకేఎస్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉంది. ఎస్‌ఆర్‌హెచ్ గెలిస్తే పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా ఆవిరైపోతాయి.
మరోవైపు నేటి మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిస్తే ప్లేఆఫ్స్ రేసు పూర్తిగా మారిపోతుంది. చెన్నై విజయం సాధిస్తే.. ఆర్సీబీ అధికారికంగా క్వాలిఫయర్-1కు చేరుతుంది. ధర్మశాల వేదికగా జరగనున్న క్వాలిఫయర్-1లో ఆర్సీబీ ఆడుతుంది. అలాగే సీఎస్‌కే కూడా ప్లేఆఫ్స్ రేసులో బలంగా నిలుస్తుంది. చెపాక్‌లో సొంత ప్రేక్షకుల మద్దతుతో సీఎస్‌కే బలంగా పోరాడనుంది. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉంది. ఈ సీజన్‌లో ప్రతి మ్యాచ్ ప్లేఆఫ్స్ సమీకరణాలను మార్చేస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ముఖ్యంగా నేటి సీఎస్‌కే-ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ ఫలితం టాప్-4 రేసును పూర్తిగా ప్రభావితం చేయనుంది. ఒకవైపు ఆర్సీబీ క్వాలిఫయర్-1 ఆశలు.. మరోవైపు పంజాబ్ భవితవ్యంపై ఈ మ్యాచ్ ప్రభావం ఉండటంతో క్రికెట్ అభిమానులంతా చెపాక్ పోరుపైనే దృష్టి పెట్టారు.
