NTV Telugu Site icon

MS Dhoni: సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి: ధోనీ

Ms Dhoni

Ms Dhoni

MS Dhoni about IPL Retirement: మానసికంగా ప్రభావం చూపించే సామాజిక మాధ్యమాలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెప్పాడు. క్రికెటర్‌గా కొనసాగాలంటే కఠోర సాధన, ఫిట్‌గా ఉండడమే కీలకమని.. వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరని మహీ తెలిపాడు. ఐపీఎల్ 2024లో గాయం వెంటాడుతున్నా ధోనీ మైదానంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 220.54 స్ట్రైక్ రేట్‌తో 161 పరుగులు చేసిన మహీ.. 14 ఫోర్లు, 13 సిక్సర్లు బాదాడు.

ఎంఎస్ ధోనీకి 42 ఏళ్లు పూర్తవబోతున్నాయి. మహీకి ఇదే చివరి ఐపీఎల్‌ అని సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడు స్పందించాడు. ‘నేను ఏడాది మొత్తం క్రికెట్‌ ఆడట్లేదు. అందుకే ఐపీఎల్‌ వచ్చేసరికి ఫిట్‌గా ఉండేలా చూసుకుంటా. ఐపీఎల్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న యువ ఆటగాళ్లతో పోటీ పడాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్‌ ఆట అంత తేలికేం కాదు. ఇందులో వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరు. ఆడాలని అనుకుంటే.. ఎవరైనా ఫిట్‌గా ఉండక తప్పదు. అందుకు ఆహార అలవాట్లను మార్చుకోవడంతో పాటు కఠోర సాధన చేయాలి. మానసికంగా ప్రభావం చూపించే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి’ అని ధోనీ చెప్పాడు. మహీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువగా చురుగ్గా ఉండడని తెలిసిందే.

Also Read: KKR vs SRH: ఈ విజయం వారిదే.. ఫైనల్‌లో మా బెస్ట్ ఇస్తాం: శ్రేయస్ అయ్యర్

‘అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. నాకు ఎంతో ఇష్టమైన వ్యవసాయంపై దృష్టి పెట్టా. మోటార్‌ బైక్‌లు, వింటేజ్‌ కార్లలో హాయిగా తిరుగుతున్నా. కుక్కలను పెంచడం అంటే కూడా నాకు ఎంతో ఇష్టం’ అని ఎంఎస్ ధోనీ తెలిపాడు. 2014లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మహీ.. 2020 ఆగష్టు 15న పరిమిత ఓవర్లకు కూడా గుడ్ బై చెప్పాడు. ధోనీ ఐపీఎల్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ చేరకుండానే చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించిన విషయం తెలిసిందే.

Show comments