NTV Telugu Site icon

MS Dhoni Retirement: ఆ తర్వాతే ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌!

Ms Dhoni Retirement

Ms Dhoni Retirement

MS Dhoni Retirement: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసిన విషయం తెలిసిందే. ఇటీవల బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓడి.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచే చివరిదని, ధోనీని మళ్లీ మైదానంలో చూడలేమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ వార్త బయటికొచ్చింది. తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ.. శస్త్రచికిత్స కోసం త్వరలో లండన్‌ వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నాడని సీఎస్‌కే వర్గాలు తెలిపాయి.

తొడ కండర గాయం నుంచి కోలుకున్న తర్వాత ఎంఎస్ ధోనీ తన రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయం తీసుకుంటాడని సీఎస్‌కే వర్గాలు పేర్కొన్నాయి. ‘ఐపీఎల్ 2024 మొత్తం ఎంఎస్ ధోనీ తొడ కండర గాయంతో ఇబ్బందిపడ్డాడు. ఈ గాయానికి శస్త్రచికిత్స కోసం మహీ లండన్ వెళ్లొచ్చు. ప్రస్తుతం అతడు పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేడు. కానీ క్రికెట్ ఆడటం కొనసాగించాలనుకుంటున్నాడు. శస్త్రచికిత్స తర్వాతే ధోనీ తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటాడు. చికిత్స అనంతరం కోలుకోవడానికి 5-6 నెలలు పడుతుంది’ అని సీఎస్‌కే వర్గాలు తెలిపాయి.

Also Read: KKR vs SRH Qualifier 1: కోల్‌కతా, హైదరాబాద్‌ క్వాలిఫయర్‌-1.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు నుంచే ఎంఎస్ ధోనీ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. వికెట్‌ కీపర్‌ డేవిడ్‌ కాన్వే కూడా గాయం బారిన పడటంతో ధోనీ కీపర్‌గా మైదానంలోకి దిగక తప్పలేదు. గాయానికి మందులు వాడుతుండడంతోనే వీలైనంత తక్కువ పరిగెత్తేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నిజానికి డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని సూచించినా.. జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో వైదొలగడంతో ఆడక తప్పలేదు. గత ఐపీఎల్‌లో మోకాలి గాయంతోనే ఆడిన ధోనీ.. జట్టుకు టైటిల్ అందించాడు. మోకాలి గాయం పూర్తిగా నయమైనా.. కండర గాయం మాత్రం ఇబ్బంది పెడుతోంది. ఐపీఎల్ 2024లో మహీ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే.