Ambati Rayudu about Mumbai Indians Environment: ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుందన్నాడు. చెన్నై జట్టులో మెరుగైన వాతావరణం ఉంటుందన్నదని పేర్కొన్నాడు. ముంబైకి గెలుపే లక్ష్యంగా ఉంటుందని, చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో ముంబై, చెన్నై జట్లకు రాయుడు ఆడిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 22న జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ పరాజయంతో ముంబై పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌లో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ముంబై, చెన్నై జట్లలోని వ్యత్యాసాన్ని వివరించాడు. ‘ఫలితాలను చెన్నై ఎక్కువగా విశ్లేషించదు. ప్రక్రియపై మాత్రమే దృష్టిసారిస్తుంది. ఫలితాలు అనుకూలంగా రాకున్నా మానసికంగా ఆందోళన చెందదు. ముంబై మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. గెలుపే లక్ష్యంగా ఆడుతుంది. ముంబై సంస్కృతి విజయాలపైనే ఆధారపడి ఉంటుంది’ అని రాయుడు పేర్కొన్నాడు.
Also Read: LSG vs CSK: ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా మార్కస్ స్టొయినిస్!
‘ముంబైలో గెలుపు తప్పనిసరి అనే సంస్కృతి ఉంటుంది. కచ్చితంగా గెలవాల్సిందే. గెలుపు విషయంలో రాజీపడొద్దని అనుకుంటుంది. చెన్నై, ముంబై జట్ల సంస్కృతి పూర్తిగా భిన్నం. కానీ రెండు జట్లు విజయం కోసం బాగా కష్టపడతాయి. అయితే చెన్నై జట్టులో మెరుగైన వాతావరణం ఉంటుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. చెన్నైలో సుదీర్ఘ కాలం ఆడొచ్చు. ముంబైలో ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది. ముంబైలోనే నా ఆట చాలా మెరుగుపడింది. పరుగులు చేస్తేనే ముంబైలో చోటు ఉంటుంది’ అని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు.