Site icon NTV Telugu

Ajinkya Rahane: అదే మా కొంపముంచింది.. ఇక మార్పులు తప్పవు!

Ajinkya Rahane Comments

Ajinkya Rahane Comments

ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 32 పరుగుల తేడాతో ఓడింది. కోల్‌కతా ఓటమిపై కెప్టెన్ అజింక్య రహానే స్పందించాడు. బ్యాటింగ్‌లో ఆరంభమే మ్యాచ్‌లో తమను వెనకబడేలా చేసిందని స్పష్టం చేశాడు. పవర్‌ప్లేలో కేవలం 36-37 పరుగులకే పరిమితం కావడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందన్నాడు. కేకేఆర్ బౌలింగ్ యూనిట్ అద్భుతంగా ప్రదర్శన కనబర్చిందని, చెపాక్ వంటి పిచ్‌పై 190 పరుగులకు ప్రత్యర్థిని కట్టడి చేయడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. పవర్‌ప్లేలో చెన్నై 70కి పైగా పరుగులు చేసినా.. తర్వాత బౌలర్లు మ్యాచ్‌ను కంట్రోల్‌లోకి తీసుకురావడం అభినందనీయమని జింక్స్ చెప్పాడు.

‘మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. చెపాక్ పిచ్‌పై 190 పరుగులకు ప్రత్యర్థిని కట్టడి చేయడం గొప్ప విషయం. ముఖ్యంగా పవర్‌ప్లేలో చెన్నై 70కి పైగా పరుగులు చేసింది. ఆపై బౌలింగ్ యూనిట్ అద్భుతం చేసి వారిని కట్టడి చేసింది. బ్యాటింగ్‌లో సరైన ఆరంభం దక్కలేదు. పవర్‌ప్లేలో మేము కేవలం 36 లేదా 37 పరుగులు మాత్రమే చేశాం. అక్కడే మేం వెనకపడిపోయాం. మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కొని పెద్ద షాట్లు ఆడటం కొంచెం కష్టంగా అనిపించింది. పిచ్ చాలా బాగుంది. ఒక బ్యాటర్ చివరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను ముగించాల్సి ఉండేది’ అని అజింక్య రహానే చెప్పాడు.

‘జట్టు కాంబినేషన్ బాగానే ఉంది. కానీ ప్రస్తుతం మా పరిస్థితి చాలా కఠినంగా ఉంది. మేము మ్యాచ్‌లు గెలవడం లేదు. ఇది జీర్ణించుకోలేని విషయం. ఇలాంటి సమయంలో పాజిటివ్‌గా ఉండటం చాలా ముఖ్యం. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని కాంబినేషన్ గురించి చర్చిస్తాం. అవసరమైతే మార్పులు చేస్తాం. కొన్ని సార్లు ఆటగాళ్లను నమ్మాలి. ఫలితాలు మనవైపు ఉంటే బాగానే ఉంటుంది. కానీ రిజల్ట్స్ సరిగా రాకపోతే కాంబినేషన్‌పై ఆలోచించాల్సి వస్తుంది. ఎప్పుడైనా పాజిటివ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం త్యాగి బాగా బౌలింగ్ చేస్తున్నాడు. నెట్స్‌లో అతను చాలా శ్రమిస్తున్నాడు. త్యాగి పేస్ కూడా అద్భుతంగా ఉంది. అతడి ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉంది. ప్రతి మ్యాచ్‌తో తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాడు’ అని జింక్స్ చెప్పుకొచ్చాడు.

‘మా ముగ్గురు స్పిన్నర్లు మాత్రమే కాదు.. సీఎస్కే స్పిన్నర్లు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. భారీ సిక్సులు కొట్టడం బ్యాటర్లకు అంత సులభం కాదు. ఫుల్ లెంగ్త్ బౌలింగ్ చేస్తే మాత్రమే షాట్లు ఆడగలిగారు. లేకపోతే బ్యాక్ ఆఫ్ లెంగ్త్ లేదా యాంగిల్స్‌తో బౌలింగ్ చేస్తే బ్యాటర్లకు కష్టంగా మారింది. ఇరు జట్ల స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు’ అని కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే పేర్కొన్నాడు. పాజిటివ్‌గా ఉండి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే ఇప్పుడు తమ పని అని రహానే అంటున్నాడు.

Exit mobile version