IPL Tickets Issue: తమిళనాడులో ఇప్పుడు ఐపీఎల్ టికెట్లు, చెన్నై సూపర్ కింగ్స్ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే సీఎస్కే టీం ను బ్యాన్ చేయాలని పలువురు రాజకీయ నాయకులు, పార్టీలు కోరతున్నాయి. పీఎంకే శాసనసభ్యుడు ఏకంగా తమిళనాడు అసెంబ్లీలోనే సీఎస్కేని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ తమిళ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తమిళనాడును వాడుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు కానీ, తమిళ ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడం లేదని అన్నారు.
Read Also: Arunachal Pradesh: అమిత్ షా అరుణాచల్ పర్యటనపై చైనా అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐపీఎల్ టికెట్లపై అసెంబ్లీలో పెద్ద పంచాయతే జరిగింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీలు రాజకీయంగా వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. ఐపీఎల్ మ్యాచుల టికెట్లు ఎమ్మెల్యేలకు ఇస్తే బాగుంటుందని ఏఐడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి అన్నారు. ఏఐడీఎంకే ప్రభుత్వం హయాంలో మేము అందరికీ టికెట్లు ఇచ్చినట్టు ఆయన అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలకు క్రీడా శాఖ మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ఐపీఎల్ నిర్వహించేది మీ మిత్రుడైన కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జైషానే అని, మేమే అడిగితే మాకు ఇవ్వరు, మీరు అడిగితే ఇస్తారంటూ చురకలు అంటించారు. మేము టికెట్స్ కోసం సొంత డబ్బును పెట్టి తమ వారి కోసం ఇస్తున్నామని ఆయన అన్నారు.