Pat Cummins Set to Play for SRH in IPL 2027: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టుకు శుభవార్త. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు వరుస సిరీస్‌లు, కీలక టోర్నీలు ఉండటంతో వారు ఐపీఎల్‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కమిన్స్ తన లభ్యతపై ఫ్రాంచైజీకి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కీలక ఆటగాడైన కమిన్స్‌ను రిటైన్ చేసుకుంది. వచ్చే సీజన్‌లో ఆడేందుకు అందుబాటులో ఉంటానని అతడు ఫ్రాంచైజీకి తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే మొత్తం టోర్నీకి అందుబాటులో ఉంటాడా? లేదా కొన్ని మ్యాచ్‌లకే పరిమితమవుతాడా? అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గత ఐపీఎల్ సీజన్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల లభ్యతపై అనేక సందేహాలు నెలకొన్నాయి. 2026 టీ20 ప్రపంచకప్ ముగిసిన కొద్ది రోజులకే ఐపీఎల్ ప్రారంభం కావడంతో కమిన్స్, మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లు తమ జట్లతో ఆలస్యంగా చేరారు. దీంతో టోర్నీ ప్రారంభ దశలో పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఈసారి కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అంతర్జాతీయ షెడ్యూల్ సవాల్‌గా మారే అవకాశం ఉంది.
యాషెస్ సిరీస్, 2027 వన్డే ప్రపంచకప్‌తో పాటు మరికొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు ఆస్ట్రేలియా ఆడాల్సి ఉంది. అంతేకాకుండా 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ బెర్త్ కోసం కూడా పోటీలో ఉంది. అందువల్ల టెస్టు మ్యాచ్‌లకు ఆటగాళ్లు ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో కమిన్స్ ఐపీఎల్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రస్తుతం పలు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తోంది. మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇటీవల ప్రచురించిన ఆత్మకథలో 2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ టెస్టులో చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ ఘటనపై చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఆ ఘటన గురించి జట్టులోని ఆటగాళ్లందరికీ ముందే తెలుసునని ఖవాజా పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటి ఆస్ట్రేలియా టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్న ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్‌పైనా ఈ వివాదం నేపథ్యంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

