IPL 2027-SRH: నకిలీ బౌలింగ్‌తో ఇన్నాళ్లు కొనసాగాడు.. తుది జట్టులోకి ఎలా వస్తాడో అర్థం కావడం లేదు!

Jaydev Unadkat Ipl 2027 Srh

Jaydev Unadkat Ipl 2027 Srh

Kris Srikkanth Slams Jaydev Unadkat Bowling: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆటగాళ్ల ట్రేడింగ్ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) నుంచి హర్షల్ పటేల్ గుజరాత్ టైటాన్స్‌లోకి వెళ్లనున్నాడనే వార్తల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ సీనియర్ పేసర్ జయదేవ్ ఉనద్కట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఇప్పటికీ అతడిని ఎస్‌ఆర్‌హెచ్ ఎందుకు వదులుకోవడం లేదో అర్థం కావడం లేదని, అతడి బౌలింగ్‌పై తనకు ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించాడు.

2025 ఐపీఎల్ వేలంలో హర్షల్ పటేల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు తీసుకున్నాడు. అయితే 2026 సీజన్‌లో మాత్రం కేవలం ఐదు మ్యాచ్‌లే ఆడిన హర్షల్.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిని రూ.4 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌కు ఆల్ క్యాష్ ట్రేడ్ ద్వారా పంపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ వంటి యువ భారత పేసర్లు సన్‌రైజర్స్‌కు కొత్త ఆశాకిరణాలుగా మారారు. దీంతో జయదేవ్ ఉనద్కట్‌కు కూడా గత సీజన్‌లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఈ పరిణామాలపై తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించిన శ్రీకాంత్.. ఉనద్కట్‌ను ఇంకా జట్టులో కొనసాగించడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నాడు.

‘సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో షెడ్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్‌ను కూడా వదిలేయలేదంటే ఆశ్చర్యంగా ఉంది. అతడి నకిలీ బౌలింగ్‌తో ఇన్నేళ్లుగా కొనసాగుతున్నాడు. అతడు అసలు తుది జట్టులోకి ఎలా వస్తాడో నాకు అర్థం కావడం లేదు. అయినా పాత కాలపు పని గుర్రం అంటూ అతడిని కొనసాగిస్తారు’ అని శ్రీకాంత్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. టైటాన్స్‌కు వెళ్లనున్న హర్షల్ పటేల్‌పైనా శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. గుజరాత్ తుది జట్టులో హర్షల్‌కు చోటు దక్కుతుందా లేదా అన్నదానిపై కూడా సందేహం వ్యక్తం చేశాడు. ‘ఎవరైనా ఆటగాడు గాయపడితే ఉపయోగించుకోవడానికి హర్షల్‌ను జట్టు రిజర్వ్‌లో ఉంచుకుంటున్నట్లుగా అనిపిస్తోంది’ అని పేర్కొన్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ ద్వారా టీ. నటరాజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి రావడంపైనా శ్రీకాంత్ స్పందించాడు. ఈ ట్రేడ్‌లో భాగంగా జీషన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లనున్నాడు. నటరాజన్, ఉనద్కట్‌ల మధ్య పెద్దగా తేడా లేదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ‘నటరాజన్ కూడా ఐపీఎల్ నుంచి ఐపీఎల్ వరకే ఆడుతున్నాడు. అయినప్పటికీ అతడు నెట్టుకొస్తున్నాడు. ఇతర దేశవాళీ క్రికెటర్లకు ఇది మంచి సంకేతం కాదు. కొంతమంది ఐపీఎల్‌లో మాత్రమే ఆడేందుకు ఫిట్‌గా ఉంటారు. మిగిలిన సమయమంతా ఫిట్‌నెస్‌పై పనిచేస్తున్నామని చెబుతుంటారు’’ అంటూ విమర్శించాడు.