Ashutosh Sharma IPL Trade: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఆటగాళ్ల ట్రేడింగ్ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు వెళుతున్నాడనే ప్రచారం ఇప్పటికే క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో తెరవెనుక మరికొన్ని ఫ్రాంచైజీలు కూడా ఆటగాళ్ల ట్రేడింగ్‌పై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు, భారత పవర్ హిట్టర్ ఆశుతోష్ శర్మపై గుజరాత్ టైటాన్స్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ఆశుతోష్ శర్మను ట్రేడ్ చేసుకునే విషయంపై గుజరాత్ టైటాన్స్ కొన్ని నెలల క్రితమే ఢిల్లీ క్యాపిటల్స్‌ను సంప్రదించింది. అయితే అప్పట్లో ఢిల్లీ నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా ఢిల్లీ సహాయక సిబ్బందిలో మార్పులు జరిగాయి. భారత మాజీ కెప్టెన్, మాజీ కోచ్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో కొత్త సహాయక బృందం బాధ్యతలు చేపట్టడంతో.. ఆశుతోష్ ట్రేడ్ ప్రతిపాదనపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. 28 ఏళ్ల ఆశుతోష్ ఐపీఎల్‌లో పవర్ హిట్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు మూడు సీజన్లలో 168.86 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ వేగంగా పరుగులు చేస్తూ తన జట్లకు విజయాలు అందించిన సందర్భాలు ఉన్నాయి. 2025 మెగా వేలంలో ఢిల్లీ అతడిని రూ.3.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో 31 బంతుల్లో అజేయంగా 66 పరుగులు చేయడం అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది.
ఆశుతోష్ శర్మ కోసం లక్నో కూడా ఆసక్తి చూపే అవకాశం ఉందని క్రిక్‌బజ్ పేర్కొంది. ఐపీఎల్ 2027 వేలానికి ముందు ట్రేడ్ విండోలో అతడిని దక్కించుకునేందుకు కొన్ని ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గుజరాత్, లక్నోలు ఆశుతోష్ ట్రేడ్ రేసులో ముందున్నాయి. మరోవైపు గుజరాత్ మరో ఫినిషర్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం మరో ఫ్రాంచైజీని సంప్రదించిన గుజరాత్.. తమ యువ ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మను ట్రేడ్‌లో భాగంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 24 ఏళ్ల అశోక్ ఐపీఎల్ 2026లో గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి ఆ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని నమోదు చేశాడు. అయితే సీజన్ రెండో భాగంలో అతడు తుది జట్టులో చోటు కోల్పోయాడు.
గుజరాత్ టైటాన్స్ ఫినిషర్ కోసం వెతుకుతుండటానికి ప్రధాన కారణం జట్టు బ్యాటింగ్ కూర్పేనని విశ్లేషకులు భావిస్తున్నారు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్‌లతో కూడిన టాప్ ఆర్డర్ నిలకడగా రాణిస్తోంది. అయితే ఈ ముగ్గురూ విఫలమైనప్పుడు జట్టును ఆదుకునే బ్యాటర్లు అవసరమవుతున్నారు. షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియాలు నిలకడైన ప్రదర్శనలు చేయకపోవడంతో.. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయగల ఆశుతోష్ శర్మను జట్టులోకి తీసుకోవాలని గుజరాత్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆశుతోష్ ట్రేడ్‌పై ఇప్పటివరకు గుజరాత్ లేదా ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

