Site icon NTV Telugu

IPL 2026 Auction: పవర్ హిట్టర్‌పై కన్నేసిన ఆర్సీబీ.. 8 మందిలో ఇద్దరు విదేశీలకు ఛాన్స్!

Rcb Home Ground Change

Rcb Home Ground Change

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 వేలంకు సమయం ఆసన్నమైంది. వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. మినీ వేలం జాబితాలో 350 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. లిస్టులో 240 మంది భారతీయులు, 110 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. మినీ వేలం మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది. వేలం కోసం 10 ప్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని జట్ల యాజమాన్యం అబుదాబికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పవర్ హిట్టర్లపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఆర్సీబీ వద్ద 16.4 కోట్ల పర్స్ వాల్యూ ఉండగా.. ఎనిమిది ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంది. అందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఉంది.

కొంతమంది స్టార్ ఆటగాళ్లను వదిలేసినా.. రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బలమైన జట్టుగా ఉంది. ఆర్సీబీ లియామ్ లివింగ్‌స్టోన్‌ను విడుదల చేసింది. అందుకే హిట్టర్లను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్సీబీ లివింగ్‌స్టోన్‌తో తిరిగి ఒప్పందం కుదుర్చుకోవచ్చు. మాథ్యూ షార్ట్, డేవిడ్ మిల్లర్‌ లాంటి హిట్టర్లు వేలంలో అందుబాటులో ఉన్నారు. విదేశీ ఫాస్ట్ బౌలర్‌ను తీసుకోవడం ఆర్సీబీకి తప్పనిసరి అనే చెప్పాలి. లుంగీ ఎన్గిడి జట్టు నుంచి రిలీజ్ అయ్యాడు. జోష్ హాజిల్‌వుడ్ ఫిట్‌నెస్ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ నేపథ్యంలో పతిరానా, మాట్ హెన్రీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నోర్జ్, ఓ’రూర్కేలలో ఒకరిని తీసుకునే అవకాశాలు లేకపోలేదు.

యష్ దయాల్ లభ్యత అనిశ్చితంగా ఉంది. ఐపీఎల్ 2025 తర్వాత అతడు ఎటువంటి పోటీ క్రికెట్ ఆడకపోవడంతో బెంగళూరు ఒక భారతీయ ఫాస్ట్ బౌలర్‌ను కూడా తీసుకోవాలని చూస్తోంది. ఆకాష్ దీప్‌ను జట్టులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని సమాచారం. ఆకిబ్ దార్, అశోక్ శర్మ, కేఎం ఆసిఫ్ వంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. బ్యాటింగ్ లైనప్‌కు బ్యాకప్ కూడా అవసరం. సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా అగ్ర ఎంపికలుగా ఉన్నారు. కార్తీక్ శర్మ, అథర్వ తయాడే వంటి అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను కూడా పరిగణించవచ్చు.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్‌ వేలంలో 39 ఏళ్ల స్పిన్నర్.. గతంలో పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు!

ఆర్సీబీకి సుయాష్ శర్మ మాత్రమే అందుబాటులో ఉన్న ఏకైక మణికట్టు స్పిన్నర్. కాబట్టి బ్యాకప్ స్పిన్నర్‌ను కూడా చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రవి బిష్ణోయ్‌ను కొనుగోలు చేయడం కష్టమే అయినప్పటికీ.. రాహుల్ చహర్, కర్ణ్ శర్మ, విఘ్నేష్ పుతూర్‌లలో ఒకరిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్సీబీకి ఓ హిట్టర్, ఫాస్ట్ బౌలర్, స్పిన్ బౌలర్ సహా బ్యాటింగ్ లైనప్‌కు బ్యాకప్ అవసరం. మరి ఎవరిని తీసుకుంటుందో చూడాలి.

ఆర్సీబీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు:
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ సింగ్ తుషార, రసిఖ్నా సలామ్.

Exit mobile version