IPL 2023: గత రెండేళ్లు కరోనా కారణంగా ఐపీఎల్ మెగా టీ20 లీగ్‌ను విదేశాల్లో నిర్వహించారు. అయితే వచ్చే ఏడాది ఇండియాలోనే ఐపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు మినీ వేలం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేలంలో పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. దీని కోసం ఒక్కో ఫ్రాంచైజీకి అదనంగా రూ.5 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన మెగా వేలంలో మిగిలిపోయిన మొత్తం ఈ రూ.5 కోట్లకు అదనం. ఐపీఎల్ మినీ వేలంపాటను నిర్వహించడానికి కొచ్చి నగరాన్ని వేదికగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 23వ తేదీన వేలంపాటను నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న పది ఫ్రాంఛైజీల వద్ద 90 నుంచి 95 కోట్ల రూపాయల బ్యాలెన్స్ మిగిలివుంది. ఈ మొత్తం ఉపయోగించి కొత్త ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Read Also: Jos Buttler: ఫైనల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఉండదు.. ఉండనివ్వం..!!
ప్రస్తుతం ఉన్న టీమ్స్‌లో పంజాబ్ కింగ్స్ దగ్గర గత వేలంలో మిగిలిపోయిన రూ.3.45 కోట్లు ఉన్నాయి. దీనికి అదనంగా రూ.5 కోట్లతో పాటు ఎవరైనా ఆటగాళ్లను ఆ టీమ్‌ను రిలీజ్ చేస్తే ఆ మొత్తం కూడా దీనికి యాడ్ అవుతుంది. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర అసలు ఏమాత్రం డబ్బు మిగలలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ దగ్గర రూ.0.45 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ దగ్గర రూ.0.95 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర రూ.1.55 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర రూ.2.95 కోట్లు, గుజరాత్ టైటాన్స్ టీమ్ వద్ద రూ.0.15 కోట్లు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల వద్ద తలో రూ.0.10 కోట్లు ఉన్నాయి. నవంబర్ 15లోపు ఫ్రాంఛైజీలు తాము రిలీజ్, రిటైన్ చేయాలనుకుంటున్న ఆటగాళ్ల జాబితాను అందించాలి. ఒక్కో ఫ్రాంఛైజీ దగ్గర గరిష్ఠంగా 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉండే అవకాశం ఉంది. అయితే గత వేలంలో లక్నో, ఢిల్లీ, పంజాబ్ టీమ్స్ ఏడుగురు విదేశీ ఆటగాళ్లనే తీసుకోవడంతో ఇప్పుడు ఆయా జట్లు మరో విదేశీ ఆటగాడిని తమ జట్టులో చేర్చుకునే ఛాన్స్ ఉంది.